నా ప్రేమ అంగీకరించవా? చూడు నిన్ను ఏం చేస్తానో అంటూ బాలిక మెడపై కత్తి పెట్టిన ఉన్మాది (video)
ఈమధ్య కాలంలో ప్రేమోన్మాదుల ఘాతుకాలు ఎక్కువవుతున్నాయి. మహారాష్ట్రలోని సితారాలో ఓ ప్రేమోన్మాది గత కొన్ని నెలలుగా పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఐతే ఆ బాలిక అతడిని తిరస్కరించింది. తనతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. దాంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆ ప్రేమోన్మాది కత్తితో దాడి చేసేందుకు ఆమె వద్దకు వెళ్లాడు.
ఆమెపై కత్తితో దాడి చేసేందుకు యత్నిస్తున్న సమయంలో అక్కడ పెద్దఎత్తున స్థానికులు గుమిగూడారు. ఇది గమనించిన అతడు తన దగ్గరకు వస్తే కత్తితో బాలికను చంపేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. ఇంతలో వెనుక నుంచి ఓ వ్యక్తి సాహసించి సదరు ప్రేమోన్మాదిని పట్టుకున్నాడు. దీనితో మిగిలినవారంతా కలిసి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను రక్షించిన స్థానికులకు ఆమె తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేసారు.