రికార్డు స్థాయి ధర పలికిన 'బ్రహ్మోత్సవం' ఫారిన్ రైట్స్
ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బ్రహ్మోత్సవం'. మహేశ్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే రూ.70 కోట్లు దాటి అందర్ని అబ్బురపరిచింది.
కాగా "బ్రహ్మోత్సవం" ఓవర్సీస్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు చెల్లించిన భారీ మొత్తం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ చిత్రం విదేశీ ప్రదర్శన హక్కులను క్లాసిక్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చి సొంతం చేసుకుంది. ఇందుకుగాను సదరు సంస్థ రూ.13.2 కోట్లు చెల్లించినట్టు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.
అక్కడ 'వన్' లాంటి ప్లాప్ మూవీ కూడా వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసిందంటే ఓవర్సీస్‌లో మహేష్ స్టామినా ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్‌లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, మునుపటి చిత్రాలు వసూళ్లను దృష్టిలో పెట్టుకునే డిస్ట్రిబ్యూటర్లు ఇంతమొత్తం చెల్లించారని తెలుస్తోంది.
'బ్రహ్మోత్సవం' చిత్రానికి యూఎస్ మార్కెట్లో మంచి వసూళ్లు ఉంటాయన్న అంచనాలతో ఇంత రేటును వెచ్చించారు. మరి 'బ్రహ్మోత్సవం'పై ఉన్న అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలుసుకోవాలంటే ఈ నెల 20వ తేదీ వరకు ఆగాల్సిందే.