మంగళవారం, 22 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 జులై 2025 (16:21 IST)

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

election commission of india
దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ ఓటర్లను ఏరివేసేందుకే ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపట్టామని, దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం ఉండబోదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేసింది.
 
సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సోమవారం ఈసీ కౌంటర్ దాఖలు చేసింది. బీజేపీ, దాని మిత్రపక్షాలకు లబ్ధి చేకూరే విధంగా బీహార్ ఓటర్ల జాబితాలో మార్పులు చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఈసీ మరోమారు తోసిపుచ్చింది. ఈసీ తన రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తిస్తోందని తెలిపింది. అయితే, కొన్ని మీడియా సంస్థలు మాత్రం తప్పుగా చిత్రీకరిస్తున్నాయని సుప్రీంకోర్టు దృష్టికి ఈసీ తీసుకొచ్చింది.
 
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఎస్ఐఆర్‌ను నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
 
అయితే, ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడీ కార్డును పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈసీని అనుమానించడానికి ఏమీ లేదని, ఈ అంశంపై మరింత విచారణ జరగాల్సి ఉన్నందున విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.