గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (12:36 IST)

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

Pushpa2 patna
Pushpa2 patna
చరిత్రలో కనీవినీ రీతితో పాట్నా లో పుష్పా-2 ట్రైలర్ లో అభిమానులు పోటెత్తారు. ఇది స్టార్ హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ అంటూ చిత్ర టీమ్ ప్రచారం చేసింది. అభిమానులు ఎక్కువగా రావడంతో కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీకి పని చెప్పాల్సిన పనికూడా కలిగింది. ఇది ఏ హైదరాాబాద్ లోనో, విజయవాడ, వైజాగ్ లలో కాదు. ఉత్తరాదిలోని పాట్నాలో. సహజంగా ప్రతి రాష్ట్రంలో ఆయా అగ్రహీరోలకు అభిమానులుంటారు. వారి సక్సెస్, ఇమేజ్ ను ద్రుష్టిలో పెట్టుకుని అభిమానులు తరలిరావడం జరుగుతుంది. ఒక్కో దశలో పెట్రేగిన అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీకి పనిచెప్పాల్సి వస్తుంది. 
 
Patna fans
Patna fans
గతంలో గ్యాంగ్ లీడర్ సినిమా వందరోజుల వేడుకకు ఆంధ్రప్రదేశ్ లో ఫంక్షన్ చేస్తే గుంటూరు, విజయవాడ ప్రాంతాలలో రోడ్లన్నీ జామ్ అయ్యాయి. అభిమానులను చూసి చిరంజీవి మరింత ఉత్సాహంగా ప్రసంగించారు. అప్పుడే చిరంజీవి ఫాలోయింగ్ చూసిన శేఖర్ అనే జ్యోతిష్యుడు ఆయన జాతకం చూసి ఎప్పటికైనా మీరు రాజకీయాల్లో వస్తారని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. ఇది పక్కన పెడితే... రానురాను అభిమానుల అభిమానం పక్కదారి పట్టినట్లుగా అనిపిస్తోంది.
 
వివరాల్లోకివెళితే.. నిన్న రాత్రి జరిగిన పుష్ప 2 ట్రైలర్ వేడుక ఉత్తరప్రదేశ్ లోని పాట్నాలో జరిగింది. గత కొద్దిరోజులుగా స్టేజీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫంక్షన్ ముందు రోజునుంచీ పాస్ లకోసం అభిమానులు తోపులాటలు, గందరగోళంగా కనిపించారని చిత్ర యూనిట్ వీడియోలు విడుదలచేసింది. అయితే అసలు వీరంతా నిజమైన అభిమానులా? లేదా తరలించారా? అనే సందేహం కూడా కలుగుతుంది.  సహజంగా అభిమానులు అనేవారు కుర్రకారే. పెద్ద వాళ్ళు అభిమానులుగా వున్నా వారి దైనందిక జీవితంలో పోరాటమే సరిపోతుంది. ఇక ఖాళీగా వుండి రాజకీయ పార్టీ కార్యకర్తల తరలింపులాగా వచ్చేవి యూత్ మాత్రమే. అందుకే వారిని టార్గెట్ చేస్తూ ఆయా హీరోలకు చెందిన మేనేజర్లు కానీ, ఈవెంట్ నిర్వాహకులు కానీ జనాలను తరలిస్తున్నారనే విమర్శ ఎప్పటి నుంచో వుంది.
 
ఆమధ్య కన్నడ నటుడు దర్శన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జెఆర్.సి.ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఆ తరుణంలో అక్కడ బయట రోడ్ మీద కుర్రాళ్ళు ఎక్కువగా కనబడ్డారు. ఆ పక్కనే టీ స్టాల్ లలో వారంతా సాయంత్రం 4 గంటలకే వచ్చారు. గుంపులు గుంపులుగా వున్నవారంతా కన్నడ  బాష మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వారిలో కొందరిని పలుకరిస్తే..  దర్శన్ ఫ్యాన్స్ అన్నారు. అక్కడ నుంచి ఇక్కడకు వచ్చారా? అని అడిగితే.. కర్నాటక నుంచి మమ్మల్ని పిలిపించారు. ఇక్కడ ఫంక్షన్ అయ్యాక ఇక్కడనుంచి ముంబైలో జరిగే ఈవెంట్ కు వెళుతున్నాం అన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు, భోజన వసతులు కల్పిస్తారని వారు తెలియజేయడం విశేషం. అసలు దర్శన్ అనే నటుడు వున్నాడని తెలుగువారికి పెద్దగా తెలీదు. అలాంటప్పుడు హైదరాబాద్ లో దర్శన్ ఫ్యాన్స్ ఎందుకుంటారు? ఇప్పుడు  ఇదే ఫార్ములా తెలుగు హీరోలు కూడా పాటిస్తున్నారని అర్థమవుతోంది.
 
అంతకుముందు దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్.ఆర్.ఆర్. సినిమా ప్రమోషన్ ను ముంబైలో నిర్వహించారు. అందులో రామ్ చరణ్, ఎన్.టి.ఆర్. హీరోలుగా నటించారు. ఆ సమయంలో చిరంజీవి చారిటబుల్ కు చెందిన స్వామినాయుడు ఆధ్వర్యంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ను బస్సులలో తరలించారు. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు విషయం తెలిసింది. 
 
తాజాగా ఇటీవలే జరిగిన గేమ్ ఛేంజర్ టీజర్ కు పాట్నాలో కూడా అభిమానులు తరలివచ్చారు. సరిగ్గా అదే ప్రాంతంలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ఫంక్షన్ కూడా జరగడం. అభిమానులు పోటెత్తడం తెలిసిందే.
 
కొత్త రాష్ట్రంలో హీరోలకు అభిమానులుండడం మామూలు విషయమే. కానీ పోటెత్తే అభిమానం అనేది చాలా వింతగా అనిపిస్తుంది. గతంలో తమిళ హీరో సూర్య కు కూడా హైదరాబాద్ లో బేనర్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం వంటివన్నీ ఇలాంటి ఎత్తుడలే కారణంగా విశ్లేషకులు తెలియజేస్తున్నారు. దీనికి తోడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగితే అభిమానులతో ఫంక్షన్ హాల్ కిక్కిరిసిపోయింది.  బయట జనాలు కూడా వేచి వున్నారు. మీడియా మాత్రం పెద్దగా లేదు. కానీ అక్కడ హీరోతో జరిగిన ప్రశ్న, జవాబుల కార్యక్రమంలో పాల్గొంది మాత్రం యూబర్స్. ఇన్ ప్యూయన్స్ లే. దానికి మీడియా సమావేశంగా చిత్రీకరించి బిల్డప్ ఇచ్చారు.
 
ఎలా వుంటుందంటే.. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే. అక్కడ క్రికెట్ బోర్డ్ నుంచి కొందరు అభిమానులను తరలించి ప్ల కార్డ్ లతో హడావుడి చేయిస్తారట. అభిమానుల అరుపులు, కేరింతలు, వారి డ్రెస్, బాడీపై ఆటగాడి ఫొటోలు, గుండు కొట్టించుకోవడం వంటి వింతపోకడలు జరుగుతుంటాయి. దాన్ని మీడియా కెమెరాలు హైలైట్ చేసేలా కొందరు చూసుకుంటారట.  ఈ తరహా ఫార్మెట్ ను ఇప్పుడు సినిమా హీరోలు చేస్తున్నారనే టాక్ కూడా వుంది. అందుకే తెలుగు హీరోలకు ఇతర రాష్ట్రాలలో జేజేలు పలికే అభిమానులు వుంటున్నారనేది తెలుస్తోంది.  ఇండస్ట్రీలో ఓ వర్గం ఇదేపనిలోవుంటూ అభిమానులతో జేజేలు కొట్టిస్తుందనీ, అందుకు ప్రచారం ఖర్చులో భాగంగా కొంత వెచ్చిస్తారని తెలుస్తోంది.
 
ఇలాంటి ఎత్తుగడలు, పోకడలు ఏ స్థాయికి చేరతాయనేది కూడా ప్రశ్నార్థకమే. ఇలాంటి ప్రచారాలు సినిమాకూ బాగా ఉపయోగడతాయని నమ్మే లక్షలు కోట్లను వెచ్చిస్తున్నారు కొంతమంది. దానివల్ల ఒక్కోసారి ఒక హీరో సినిమా మన రాష్ట్రంలో బాగా ఆడినా, మరో రాష్ట్రం ఆడని సందర్భాలున్నాయి. అయినా వందల కోట్ల క్లబ్ లోకి సినిమా చేరిందనే ప్రకటనలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా అభిమానులు అనేవారు హీరోలకు వుండడం సహజమే. కానీ శ్రుతి మించిన అభిమానం భవిష్యత్ లో నెగెటివ్ గా మారే అవకాశం లేకపోలేదని పలువురు సినీ ప్రముఖులు తెలియజేయడం విశేషం.