చేసే క్యారెక్టర్‌లో ప్రాధాన్యత ఉంటేనే అంగీకరిస్తా : అనుపమా పరమేశ్వరన్
'అ.. ఆ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై అందరినీ ఆకట్టుకున్న అనుపమా 'ప్రేమమ్' చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన ప
'అ.. ఆ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై అందరినీ ఆకట్టుకున్న అనుపమా 'ప్రేమమ్' చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారులుగా చందు మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సూర్యదేవవ నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'. దసరా కానుకగా ఈనెల 7న విడుదలవుతున్న నేపథ్యంలో అనుపమా మంగళవారం మీడియాతో ముచ్చటించింది. ''పాత్రనే కాదు సినిమానీ ప్రేమించా.. మలయాళ 'ప్రేమమ్'తో కెరీర్ స్టార్ట్ చేశాను.
ఆ సినిమాతో పోలిస్తే తెలుగు వెర్షన్‌లో నా క్యారెక్టర్ నిడివి ఎక్కువ. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు. అలాగే మలయాళంలో క్రిస్టియన్ అమ్మాయి మేరీగా నటిస్తే, తెలుగు 'ప్రేమమ్'లో హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయి సుమ పాత్రలో నటించాను. ఇదే పాత్రను తెలుగులో కూడా చేయటానికి కారణం ఒక్కటే.. మలయాళ 'ప్రేమమ్'లో నటించినప్పుడు నా పాత్రనే కాదు సినిమానీ బాగా ప్రేమించాను. అందుకే తెలుగు వెర్షన్ కోసం అడిగినప్పుడు నో.. అని చెప్పలేకపోయాను.
'నేను చేసే క్యారెక్టర్‌కు సినిమాలో ఏదో ఒక ప్రాధాన్యం ఉండాలి. నేనే పని చేసినా అది నాకు సంతోషాన్నివ్వాలని ఆశిస్తాను. డబ్బుకు అంతగా ప్రయారిటీ ఇవ్వన'ని అంటోంది అనుపమా పరమేశ్వరన్. మొదట్లో టెన్షన్ పడ్డాను..మలయాళంలో ఓ యంగ్ టీంతో కలిసి ఎంజారు చేస్తూ చేసిన సినిమా 'ప్రేమమ్'. అలాగే తెలుగులో కూడా మంచి యంగ్ టీమ్ కుదిరింది. అయితే తెలుగు భాష నాకు రాదు. దాని కోసం బాగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. ఇదంతా ఓ ఎత్తయితే, నాగచైతన్యతో కలిసి నటించటం మరో ఎత్తు.
సినిమా మొదలైన కొత్తల్లో చాలా టెన్షన్ పడ్డాను. నేను టెన్షన్ పడకుండా చైతూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. దాంతో నాలో భయం తగ్గిపోయింది. నేను చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యాను. చైతూ గురించి చెప్పాలంటే.. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే తత్వంగల మనిషి. ఇక సినిమాలో చైతూ క్యారెక్టర్ చాలా నేచురల్‌గా ఉంటుంది. ఎందుకంటే అతని క్యారెక్టర్‌లో రెండు వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ కోసం చైతూ చాలా కష్టపడ్డాడు. తన లుక్‌నీ మార్చుకున్నాడు. అలాగే దర్శకుడు చందు మొండేటి చాలా కామ్ అండ్ కూల్. ఏ పరిస్థితినైనా చాలా చక్కగా హ్యాండిల్ చేసేవాడు. మంచి టాలెంటెడ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందని వెల్లడించింది.