62 ఏళ్ళ జయభేరి
అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి, ఎస్.వి. రంగారావు, ముఖ్యపాత్రలు పోషించిన సినిమా `జయభేరి`. 1959లో ఏప్రిల్ 9న విడుదలైంది. ఇప్పటికి 62 ఏళ్ళు అయింది. ఇటువంటి సినిమాను ఒక్కసారి మననం చేసుకునేందుకు ఈ ప్రయత్నం. అప్పట్లో మోస్తరు సినిమాలలో ఇది ఒకటి. సినిమాలో పాటలు బాగా హిట్టయ్యాయి. `రాగమయీ రావే అనురాగమయీ రావే.., రసికరాజ తగువారముకామా అగడు సేయ తగవా ఏలుదొరవు అరమరకలు` అనేవి బాగా ప్రాచుర్యం పొందాయి. స్క్రీన్‌ప్లే: పి. పుల్లయ్య, ఆత్రేయ, దర్శకుడు: పి. పుల్లయ్య.
1947లో వి. శాంతారం తీసిన మరాఠీ సినిమా "లోక్ షేర్ రామ్ జోషి", హిందీ సినిమా "మత్‌వాలా శాయర్ రామ్ జోషీ"లు ఈ సినిమాకు మూలాలు
రసికరాజ తగువారము కామా - పాటను ఘంటసాల పది రోజుల్లో 100సార్లు పైగా రిహార్సిల్ చేసుకొని పాడాడు.
ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి తీయబడింది. తమిళం పేరు "కళైవణ్ణన్". తమిళ సినిమా విడుదల ఆలస్యమయింది. తెలుగు సినిమా మోస్తరుగా ఆడింది.
కథగా చెప్పాలంటే,
నాగయ్య సంగీత శాస్త్ర కోవిదుడు. వారివద్ద సంగీతవిద్య నభ్యసించి అగ్రస్థానంలో నిలిచిన వాడు కాశీనాథ్ (అక్కినేని). అతనికి అన్న విశ్వనాథ్ (గుమ్మడి వెంకటేశ్వరరావు), వదిన (శాంతకుమారి) అంటే ఎంతో గౌరవం, అభిమానం. బచ్చెన భాగవతులు ఇచ్చిన ప్రదర్శన చూడడానికి వెళ్ళిన కాశీనాథ్ అందులో ప్రధాన పాత్ర వహించి, సవాలు చేసిన మంజుల (అంజలీదేవి) తో ప్రతిసవాలు చేస్తాడు. వారిద్దరి మధ్యా జరిగిన సంగీత సాహిత్యపరమైన వివాదం ప్రణయానికి దారితీస్తుంది. మంజులతో వివాహానికి కుల పెద్దలు అడ్డుచెబుతారు. కాశీనాథ్ ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం అన్నగారికి దూరమై, ఇల్లు వదలి మంజులను దేవాలయంలో వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత కథ ఎటువైపు మలుపు తిరిగింది అనేది మిగిలిన సినిమా.
ఇందులోని పాటలను మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎం.ఎల్.వసంతకుమారి, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం వంటి ఉద్దండులు ఆలపించారు. బహుశా ఒక సినిమాకు ఇంతమంది పాడడం విశేషమనే చెప్పాలి.
అప్పటి సామాజిక పరిస్థితులు అంశాలు ఇందులో పుష్కలరంగా చూపించారు. కుల ప్రాదిపదకన ఎటువంటి ఇబ్బందులు పడ్డారు. భక్తిభావంతో ఏదైనా సాధించవచ్చని ముగింపు బాగా చూపించారు. ఫైనల్‌గా దేవుడ్ని అందరం వేడుకోవాలనేది ఇందులో మూల సారాంశం.