శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (12:06 IST)

చిత్ర శీలాన్ని శంకించడం వల్లే ఆత్మహత్య : 'నిజం' చెప్పిన హేమనాథ్!

తమిళ బుల్లితెర నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసులోని మిస్టరీ ఇపుడు వీడిపోయింది. తన శీలాన్ని శంకించడం వల్లే చిత్ర ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. ఇదే విషయాన్ని ఆమె ప్రియుడు, పారిశ్రామికవేత్త హేమనాథ్ స్వయంగా ఆర్డీవో, పోలీసులు జరిపిన విచారణలో వెల్లడించారు. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ నెల 9వ తేదీన పూందమల్లి, నజరత్‌పేటలోని ఓ నక్షత్ర హోటల్‌లో వీజే చిత్ర ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి చిత్ర భర్త హేమనాథ్‌ను స్థానిక పోలీసులు ఆరురోజులపాటు విచారణ జరిపిన మీదట అరెస్టు చేశారు. చిత్ర శీలాన్ని శంకించి హేమనాథ్‌ ఆమెను తరచూ చిత్రహింసలు పెట్టసాగాడు. 
 
ఈ క్రమంలో డిసెంబరు 8వ తేదీ రాత్రి సీరియల్‌ షూటింగ్‌లో చిత్ర సహనటుడితో శృంగారభరిత సన్నివేశంలో నటించడంపై ఆగ్రహం చెంది గొడవపడ్డాడని, దీంతో మనస్తాపం చెందిన చిత్ర ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నదని ఆ విచారణలో వెల్లడైంది. చిత్రను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడనే నేరారోపణపై హేమనాథ్‌ను అరెస్టు చేసి పొన్నేరి సబ్‌జైలుకు తరలించారు. 
 
ఇదిలావుంటే, చిత్ర, హేమనాథ్‌ గత అక్టోబరు 19వ తేదీన రిజిస్టర్‌ మేరేజ్‌ చేసుకున్నారు. దీంతో పెళ్ళయిన నెలన్నర లోగా చిత్ర ఆత్మహత్య చేసుకోవడంతో ఆర్డీవో విచారణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీపెరుంబుదూరు ఆర్డీవో దివ్యశ్రీ ఆత్మహత్య చేసుకున్న చిత్ర తల్లిదండ్రుల వద్ద విచారణ జరిపారు. 
 
ఆ తర్వాత హేమనాథ్ వద్ద ఆర్డీవో విచారణ జరిపారు. పొన్నేరి సబ్‌జైలులో ఉన్న హేమనాథ్‌ను గురువారం ఉదయం బందోబస్తు మధ్య వ్యాన్‌లో తీసుకువెళ్లి శ్రీపెరుంబుదూరు కార్యాలయంలో ఆర్డీవో దివ్యశ్రీ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఆర్డీవో దివ్యశ్రీ అడిగిన పలు ప్రశ్నలకు హేమనాథ్‌ సమాధానమిచ్చాడు. ఆర్డీవో అతడి వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు హేమనాథ్‌ను వ్యాన్‌లో పొన్నేరి సబ్‌జైలుకు తరలించారు.