"సీతారామయ్య గారి మనవరాలు" మీనా పుట్టిన రోజు
దక్షిణాది టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మీనా.. 1982లో "నెంజంగల్" చిత్రంతో తెరపైకి వచ్చింది. ఆమె సుదీర్ఘ కెరీర్‌లో హిట్ సినిమాలు అందించింది. టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక పాత్రలు పోషించిన తరువాత ఆమె 1990లో రాజేంద్ర ప్రసాద్ నటించిన "నవయుగం" చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఆమెకు కొన్ని సినిమాలు మంచి మార్కెట్ ఇచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావు, మీనా, రోహిణి నటించిన "సీతారామయ్య గారి మనవరాలు" ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. దీనికి క్రాంతి కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మీనా కెరీర్‌ను మలుపు తిప్పింది. తన కుటుంబ సమస్యలను తీర్చడానికి భారతదేశానికి వచ్చిన ఎన్నారై అమ్మాయి సీత పాత్రకు మీనా ఉత్తమ నటి నంది అవార్డును గెలుచుకుంది.
"చంటి" సినిమాలో వెంకటేశ్, మీనా నటించారు. రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ చిత్రంలో నటనకు గానూ మీనా ఉత్తమ నటి ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఇదే తరహాలో సూర్యవంశం, మా అన్నయ్య సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు సంపాదించింది.