గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (18:11 IST)

ఇష్టమైన ప్రదేశంలో కృష్ణంరాజు శాశ్వత నిద్ర - ముగిసిన అంత్యక్రియలు

krishnam raju
అనారోగ్యం కారణంగా ఆదివారం వేకువజామున కన్నుమూసిన సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు (82) అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ముగిశాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాతమైన మొయినాబాద్‌లోని కనకమామిడి ప్రాంతంలో ఉన్న ఆయన సొంత ఫాంహౌస్‌లో ఈ అంత్యక్రియలు ముగిశాయి. ఈ ఫాంహౌస్ అంటే కృష్ణంరాజుకు అమితమైన ఇష్టం. అందుకే ఆయన్న అంత్యక్రియలు అక్కడే తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంచనాలతో పూర్తి చేశారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గన్ సెల్యూట్ చేశారు. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ తన పెదనాన్న కృష్ణంరాజుకు తలకొరివి పెట్టారు. 
 
నిజానికి కనకమామిడి ఫాంహౌస్ కృష్ణంరాజుకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఫాంహౌస్‌లోనే శేషజీవితం గడపాలని భావించి, ఇంటి నిర్మాణానికి కూడా పూనుకున్నారు. అయితే విధి మరోలా తలచి కృష్ణంరాజును అందరికీ దూరం చేసింది. ఈ నేపథ్యంలో, ఆయనకు బాగా నచ్చిన కనకమామిడి ఫాంహౌస్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించి పూర్తి చేశారు. 
 
కాగా, ఈ అంత్యక్రియలు సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులను, ప్రముఖులను, బంధుమిత్రులను, అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫాంహౌస్‌లోకి పంపించారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగే చోటుకు వచ్చారు.