కృష్ణంరాజు మృతికి కైకాల సత్యనారాయణ సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ ఉప్పలపాటి కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారన్న వార్త విని కలత చెందాను. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఎప్పటిలాగే తిరిగి ఇంటికి వస్తారని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అన్నారు.
ఆయన కంటే కొంచెం వయసు ఎక్కువే అయినా మా మధ్య మంచి అనుబంధం ఉండేది. అవి “ద్రోహి” సినిమా రిలీజ్ అయిన రోజులు. ఆ సినిమా చూస్తున్న సమయంలో కృష్ణంరాజుకి డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు ? అని నాకు అనుమానం కలిగింది. సహజంగా నాకు అన్న ఎన్టీఆర్ వాయిస్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు. అలాంటిది ఆయన తెలుగు పలుకుతున్న విధానం నన్ను కట్టి పడేసింది.
సుదీర్ఘ కవితలను, డైలాగులను అలవోకగా చాలా స్పష్టంగా పలుకుతున్నారు అది విని పక్కనే కూర్చున్న అల్లు రామలింగయ్యతో ఏమయ్యా లింగయ్య.. ఆ కుర్రాడికి డబ్బింగ్ చెప్పింది ఎవరయ్యా? ఎవరో గానీ, అన్న గారిలా బాగా రౌద్రంగా చెబుతున్నారు.. ఎవరు? అని ఆతృతగా అడిగితే సొంత డబ్బింగ్ అని చెప్పారు. అది విని ఆశ్చర్యపోయాను, సినిమా అయిపోయాక వెంటనే ఆయనను కలిసి ఏమయ్యా ఇంత అద్భుతంగా డైలాగులు చెబుతున్నావ్.. నువ్వు మరిన్ని చిత్రాల్లో నటించాలి అని అంటే.. ఆ మాటకు ఆయన నవ్వుతూ.. అంటే.. ఇప్పుడు నన్ను మీకు కూడా క్యారెక్టర్స్ లేకుండా చేయమంటారా ? అంటూ నవ్వేశారు.
అలా మొదలైన మా పరిచయం మారణహోమం, ప్రేమ తరంగాలు, అమర దీపం, బొబ్బిలి బ్రహ్మన్న, రావణ బ్రహ్మ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో భాగమయ్యేలా చేసింది. ఆయన లాంటి నటుడిని దూరం చేసుకుని కళామ తల్లి బాధపడుతుంది. ఆయన కన్నుమూయడం తెలుగు సినీ జగత్తుకే కాదు మా అందరికీ తీరని లోటు అని పేర్కొన్నారు.