గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:03 IST)

రారాజుకు వీడ్కోలు - ప్రారంభమైన కృష్ణంరాజు అంతిమ యాత్ర

krishnamraju final journey
పోస్ట్ కోవిడ్ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆదివారం వేకువజామున మృతి చెందిన సీనియర్ నటుడు కృష్ణంరాజు అంతిమ యాత్ర సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ అంత్యక్రియలు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగుతున్నాయి. 
 
దీంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని కనకమామిడి ఫాంహౌస్‌లో కృష్ణంరాజు శాశ్వత విశ్రాంతి తీసుకోనున్నారు. అక్కడ ప్రభుత్వ అధికారక లాంఛనాలతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
కనకమామిడి ఫాంహౌస్‌లోని బ్రౌన్ టౌన్ రిసార్టులో కృష్ణంరాజు అంత్యక్రియలను పూర్తి చేస్తారు. ఈ ప్రాంతానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే, అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభిమానులతో పాటు మీడియాను కూడా రిసార్టులోనికి అనుమతించలేదు. అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు పార్థివదేహాన్ని పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు.