శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2024 (18:30 IST)

గిరిజన గ్రామాలకు స్వచ్ఛమైన నీరు అందించనున్న ఆదిత్య ఓం

Aditya Om at Cherupalli village
Aditya Om at Cherupalli village
నటనతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్న హీరో ఆదిత్య ఓం. తెలంగాణలోని గిరిజన గ్రామమైన చెరుపల్లిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆదిత్య ఓం ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ ప్రజలందరికీ స్వచ్చమైన నీటిని అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. కలుషితమైన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆదిత్య ఓం చెరుపల్లి, ఇరుగు పొరుగు గ్రామాల అవసరాలను తీర్చేందుకు RO వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు.
 
RO ప్లాంట్ నుంచి వచ్చే స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీటితో అక్కడి ప్రజల సమస్యలు తొలిగిపోనున్నాయి. ఇక నీటి సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా దూరం కానున్నాయి. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరి ప్రజలకు అందించాలని అనుకుంటున్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఆదిత్య ఓం త్వరితగతిన పనులు చేపడుతున్నారు. ఈ మేరకు గ్రామస్తులు ఆదిత్య ఓంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 
 
ఇటీవలే ఆదిత్య ఓం బిగ్ బాస్ షోలో సందడి చేశారు. సినిమాలతో దగ్గరైన ఆదిత్య ఓం.. ఈ షోతో తెలుగు ప్రజల ఇంట్లోకి కూడా వచ్చేశారు. ఆదిత్య ఓం ప్రస్తుతం ‘బంధీ’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఇదొక ప్రయోగాత్మక చిత్రమన్న సంగతి తెలిసిందే. పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేలా బంధీ చిత్రం తెరకెక్కుతోంది.