ఆర్ఆర్ఆర్ హీరోయిన్స్ వీళ్లే.. కీలకపాత్రలో అజయ్‌దేవ్‌గణ్, సముద్రఖని

ajay devgan
వాసు| Last Updated: గురువారం, 14 మార్చి 2019 (15:27 IST)
‘బాహుబలి’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రారంభించిన ప్రాజెక్ట్ "ఆర్ఆర్ఆర్". టాలీవుడ్‌‌లోని అగ్రహీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఈ సినిమాలో హీరోలు కావడం, 'బాహుబలి'తో రాజమౌళి సాధించిన అద్భుత విజయాలతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ పైనే ఉంది. సినిమా మొదలుకాక ముందు ఈ ప్రాజెక్టుపై ఎన్ని వార్తలు వచ్చాయో.. మొదలయ్యాక కూడా అంతకు మించి రూమర్లు చక్కర్లు కొట్టాయనేది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ ముఖ్యంగా ఈ చిత్ర కథ గురించి, అందులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ పాత్రలపైన, వీరికి జోడీగా నటించనున్న హీరోయిన్‌లపై గురించి చాలా పుకార్లు షికార్లు చేస్తూ.. విభిన్న పాత్రలు తెరపైకి వచ్చాయి.

అయితే ఈ పుకార్లు అన్నింటికీ చెక్ పెడుతూ చిత్ర కథతో పాటు పాత్రలు, పాత్రధారులు, విడుదల తేదీని ప్రకటించాడు జక్కన్న. కథ విషయానికి వస్తే, ఇదో ఫిక్షనల్ పాన్ ఇండియా మూవీ అని, అల్లూరి సీతా రామరాజు, కొమరం భీమ్ పోరాట యోధులుగా మారటానికి ముందు కొంత కాలం ప్రపంచానికి దూరంగా వెళ్లారు.

ఆ సమయంలో వారు ఎక్కడున్నారు, యోధులుగా మారడానికి దారి తీసిన సంఘటనల నేపథ్యంలో అల్లిన ఊహాత్మక కథే ఆర్ఆర్ఆర్ అని చెప్పారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఆయనకు జోడీగా ఆలియా భట్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందనీ... సీతగా కథను మలుపు తిప్పే బలమైన పాత్రలో కనిపించబోతోందని తెలిపారు.

ఇక కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. ఆయనకి జోడిగా హాలీవుడ్ సుందరి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటిస్తుంది. వీరితో పాటు అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే ఆయనది ప్రతినాయకుడి పాత్ర కాదనే క్లారిటీ మాత్రం ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రఖని మరో కీలకపాత్రలో కనిపించబోతున్నట్టు తెలిపారు. కాగా... 2020 జూలై 30వ తేదీన ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ప్రకటించారు.దీనిపై మరింత చదవండి :