మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 30 అక్టోబరు 2018 (20:15 IST)

అలీ హీరోగా ‘‘పండుగాడి ఫోటో స్టూడియో’’ (వీడు పోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది)

‘యమలీల’ చిత్రంతో హాస్య కథానాయకుడిగా నిరూపించుకున్న అలీ హీరోగా మళ్ళీ పూర్తీ వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ‘పండుగాడి ఫోటో స్టూడియో’ చిత్రం గుంటూరు జిల్లా తెనాలిలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ కామెడీ చిత్రానికి  ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్. పెదరావూరు ఫిల్మ్ స్టూడియో పతాకంపై దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ తొలి క్లాప్‌ను ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ముహూర్తపు వేడుకల్లో పాల్గొని చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు అందజేశారు.
 
ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ.. ‘‘కామెడీ చిత్రాలు కరువైన ఈ రోజుల్లో హాస్య ప్రియులకు పండుగాడి ఫోటో స్టూడియో సినిమా ఫుల్ మీల్స్ అవుతుందని ఆశిస్తున్నాను. దేవుళ్ళను పూజించకుండా సినిమా ముహూర్తానికి హాస్యబ్రహ్మ జంధ్యాల, సంచలన దర్శకుడు కె.బాలచందర్ ఫోటోలకు దర్శకుడు దిలీప్ రాజా చేతులు జోడించి నమస్కరించడం చూశాక ఆయన అభిరుచి ఎలాంటిదో స్పష్టం అవుతుంది. ఈ సినిమా ఘన విజయం సాధించి చిత్రయూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను..’’ అని అన్నారు. 
 
తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కథ అంతా నాకు తెలుసు. హాస్యప్రధానమైన చిత్రం. పండుగాడు ఎవరికీ ఫోటో తీసినా వారికి పెళ్ళి అయిపోతుందనే ఇతివృత్తం ఈ సినిమాలో హాస్యానికి కేంద్రం అవుతుంది. దాదాపు 1150 సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన అలీ మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేయగలడనే దర్శకుడి ఆలోచనను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. హర్రర్ చిత్రాలు విపరీతంగా రిలీజ్ అవుతున్న ఈరోజుల్లో కుటుంబ సభ్యలతో కలిసి చూసేలా దర్శకుడు దిలీప్ రాజా ఈచిత్రాన్ని రూపొందిస్తారని ఆశిస్తున్నాను. రాజాకు కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి బూతు పదాలకు, ద్వందార్దాలకు ఇందులో చోటు ఉండదు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.
 
దర్శకుడు దిలీప్ రాజా  మాట్లాడుతూ..‘‘హాస్యానికి అపహాస్యానికి రెండు అక్షరాలు మాత్రమే తేడా ఉంటుంది. దీన్ని గమనించే పూర్తీ స్థాయి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. నా సినిమా.. హాస్యంలో జంధ్యాల, దర్శకత్వంలో బాలచందర్ గారి ప్రభావం ఉంటుందన్నారు. అందుకే దేవుళ్ళకు మొక్కకుండా వారికే మొక్కాను. ఇందులో పండుగాడి పాత్రను అలీగారు మాత్రమే చేయగలరు. నేను పెద్ద పోటుగాడిని, సూపర్ హిట్ సినిమా తీస్తున్నానని ముందే చెప్పటం లేదు. అది తేల్చాల్సింది ప్రేక్షకులు మాత్రమే. అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఈ సినిమా మళ్లీ ఓ జంధ్యాల మార్క్ కామెడీ సినిమాగా ఉంటుందని, సినిమా హాలు నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా నేను సృష్టించిన పాత్రలు ప్రేక్షకులను పలకరిస్తాయని మాత్రం చెప్పగలను. ఇందులో ప్రతి పాత్రను..  ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా డిజైన్ చేశాను..’’ అని అన్నారు. 
 
ఈ సినిమా హీరో అలీ మాట్లాడుతూ.. ‘‘కథ చాలా బాగుంది. కథతో పాటు ఇందులో పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇళయరాజా దగ్గర పనిచేసిన యాజమాన్య సంగీతంలో, బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ పాడిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. చాలా కాలం తర్వాత ఫుల్ కామెడీ సినిమాలో చేస్తున్నాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది..’’ అన్నారు. అలీ, రిషిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, జీవ, సుధ, దేవిశ్రీ, చిత్రం శ్రీను, వర్ధమాన నటి టీనా చౌదరి, జబర్దస్ట్ రాము తదితరులు నటిస్తున్నారు.