శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:07 IST)

అల్లు అర్జున్ వరుస చిత్రాలు... త్రివిక్రమ్ చిత్రం టైటిల్ ఖరారు?

ఏఏ19, ఏఏ20, ఏఏ21 అంటూ వరుసగా ప్రకటనలు వచ్చేశాయి. 2019-20 మోస్ట్ అవైటెడ్ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ ఖచ్చితంగా చేరబోతున్నారు. ఏఏ 21కి "ఐకన్" అనే టైటిల్ ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, సుకుమార్‌లతో సినిమాలకు ఎలాంటి టైటిల్స్ పెడతారో అని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. దిల్ రాజు, వేణు శ్రీరామ్ దూకుడు ముందు త్రివిక్రమ్ సుకుమార్ టీంలు ఝలక్ అవడంతో మరో సారి సోషల్ మీడియాలో బన్ని ప్రతి అప్‌డేట్ చర్చకు వస్తోంది. ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వ్యాపించాయి. 
 
ఇప్పటికే మాటల మాంత్రికుడి ఆస్థాన లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటల పని మొదలెట్టేశారట. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలకు బ్లాక్ బస్టర్ పాటలను అందించిన శాస్త్రి గారు ఈసారి కూడా అదే జోష్‌తో లిరిక్స్ డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే రికార్డింగ్ కార్యక్రమాల విశేషాలు కూడా తెలుస్తాయట. ఇంకా ఈ చిత్రానికి సంగీత దర్శకులు ఎవరంటే దేవిశ్రీ, తమన్ అని చెప్పుకున్నా, చివరికి తమన్‌కే త్రివిక్రమ్ ఛాన్సిచ్చారు. అరవింద సమేత తర్వాత తమన్ మరోసారి త్రివిక్రమ్‌తో కలిసి పని చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో బన్ని బర్త్‌డే రోజున ట్వీట్ ద్వారా వివరాల్ని అందించారు. ఈనెల 24 నుంచి రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు టీమ్ వెల్లడించింది. ప్రస్తుతం తమన్ బాణీల వేటలోనే ఉన్నారట. కథానాయిక పరంగా కూడా సస్పెన్స్ వీడిపోయిందని ఇటీవల ప్రచారమైంది. తొలుత ముంబై భామ కియరా అద్వాణీ పేరు వినిపించినా చివరికి తన లక్కీ మస్కట్ అయిన పూజా హెగ్డేకే త్రివిక్రమ్ మరోసారి ఛాన్సిచ్చారట. 
 
డీజే తర్వాత రెండోసారి బన్ని సరసన పూజా లక్కీ ఛాన్స్ కొట్టేసిందని ప్రచారమైంది. ఇక ఈ ఏఏ 19 టైటిల్ విషయంలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా నాన్న నేను అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్రివిక్రమ్ రాసుకున్న కథకు టైటిల్ ఇదేనని ప్రచారమవుతోంది. అయితే టైటిల్‌ని కథానాయికల వివరాల్ని టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గీతా ఆర్ట్స్, హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.