శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 27 ఏప్రియల్ 2017 (08:10 IST)

బాహుబలి జ్వరంతో ఊగిపోతున్న ప్రపంచం.. అన్ని రికార్డులూ బద్దలే అంటున్న ఫిల్మ్ ట్రేడ్ అనలిస్టులు

బాహుబలి 2 కోసం రెండేళ్లు వెయిట్ చేసి మైండ్ దొబ్బింది, తొలిరోజే దాన్ని చూసేయాలి. అయ్యా సెలవిప్పించండి అంటూ ప్రాదేయపడిన సాధారణ పోలీసు కానిస్టేబుల్ నుంచి, సెలవిస్తే సరే బంక్ కొట్టి సినిమాకు చెక్కేయడమే అం

సరిగ్గా ఇంకో 12 గంటల్లో బాహుబలి-2 సినిమా తొలి ప్రీమియం ముంబైలో బాలీవుడ్ ప్రముఖులకు ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత 8 గంటలకు ప్రపంచం యావత్తూ బాహుబలి మేనియాలో చిక్కుకోనుంది. బాహుబలి 2 కోసం రెండేళ్లు వెయిట్ చేసి మైండ్ దొబ్బింది, తొలిరోజే దాన్ని చూసేయాలి. అయ్యా సెలవిప్పించండి అంటూ ప్రాదేయపడిన సాధారణ పోలీసు కానిస్టేబుల్ నుంచి, సెలవిస్తే సరే బంక్ కొట్టి సినిమాకు చెక్కేయడమే అంటున్న విద్యార్థులు, ఉద్యోగం ఉన్నా, ఊడినా ఒకటే.. బాహుబలి తొలి రోజు తొలి ఆటకు పోవలసిదే అంటున్న ఐటీ ఉద్యోగుల వరకు ప్రపంచం ఇప్పుడు బాహుబలి జ్వరంతో ఊగిపోతోంది.
 
రెండేళ్లుగా ప్రేక్షకుల ఈ సంరంభంమీదే, కనీవినీ ఎరుగని ఈ ఆసక్తిమీదే నిర్మాతలు పెట్టుబడి పెట్టారు. బాహుబలి పార్ట్-1 లో సస్పెన్స్‌గా మిగిలి ఉన్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అయితే 2015లో విడుదలైన పార్ట్-1 బాక్స్ ఆఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. రేపు విడుదల కాబోతున్న బాహుబలి పార్ట్-2 మరెన్ని రికార్డులు సృష్టిస్తోందన్నదే ప్రస్తుతం చర్చనీయాంశం.
 
బాహుబలి-2  సరిగ్గా 24 గంటల లోపు అంటే శుక్రవారం తెల్లవారకముందే అన్ని థియేటర్ల సిల్వర్ స్క్రీన్లపైకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్లను జోరుగా కొనుగోలు చేయగా.. భారీగా థియేటర్ల ముందు ప్రేక్షకులు బారులు తీరారు. దాదాపు సినిమా ప్రదర్శించబోయే అన్ని థియేటర్ల టిక్కెట్లు బుక్ అయిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9వేల స్క్రీన్లపై దీన్ని ప్రదర్శించబోతున్నారు. తమిళనాడు, కేరళలలో 70-75 శాతం బాహుబలి పార్ట్-2 కోసమే బుక్ అవ్వగా.. తెలంగాణ ఆంధ్ర్రప్రదేశ్ లలో 80 శాతం థియేటర్లలో ఈ సినిమానే విడుదల చేస్తున్నారు. 
 
9వేల స్క్రీన్లలో రోజుకు 5 షోలు. అంటే ఒక్క షోకు 300 మంది చొప్పున తీసుకున్నా.. తొలిరేజే రూ.135 కోట్లకు పైగా బాక్సాఫీసు కలెక్షన్లను వసూలు చేయనుందని ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్టులు  చెబుతున్నారు.
ఫిల్మ్ యూనిట్ అభ్యర్థన మేరకు సింగిల్ స్క్రీన్ థియేటరల్లో 10 రోజులు పాటు రోజుకు ఆరు షోలు వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ వసూలు మరింత పెరుగనున్నాయని అనాలిస్టులు పేర్కొంటున్నారు. అంటే అదనంగా మరో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేర తొలి వీక్ కలెక్షన్లు నమోదుకానున్నాయని ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్టు శ్రీధర్ పిలై చెప్పారు. అయితే తెలంగాణలో రోజుకు ఐదు షోలు మాత్రమే వేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది.  
 
ఈ సినిమా హిందీ వెర్షన్ అద్భుతంగా ఉందని, హిందీ వెర్షన్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎక్స్లెంట్ గా నమోదయ్యాయని పిలై పేర్కొన్నారు. ఇప్పటికే అంచనాలను అధిగమించి టిక్కెట్లను ప్రేక్షకులు బుక్ చేసుకున్నారని హిందీ ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్టు కోమల్ నహ్తా తెలిపారు. ఈ సినిమా తొలి పార్ట్ దేశీయ బాక్స్ ఆఫీసు కలెక్షన్లు గ్రాస్ రూ.360 కోట్ల నుంచి రూ.370 కోట్ల మేరకు వసూలయ్యాయి.
 
కంక్లూజిన్ పార్ట్‌లో దేశంలోనే 450 కోట్ల నుంచి 460 కోట్ల వసూలుచేయొచ్చని కోమల్ అంచనావేస్తున్నారు. ఇదే దేశీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లని పేర్కొన్నారు. ఓవర్సిస్ మార్కెట్లోనూ ఇది దుమ్మురేపబోతోందని వార్తలు వస్తున్నాయి. దుబాయ్ లో ఇప్పటికే లక్షకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయని పిలై తెలిపారు. ఇప్పటివరకు ఏ సినిమాకు లేని అడ్వాన్స్ బుకింగ్స్ దీనికి దక్కినట్టు వెల్లడించారు. సింగపూర్, మలేసియా, నార్త్ అమెరికాలోనూ ఇది రికార్డులు సృష్టిస్తుందని పిలై అంచనావేస్తున్నారు.   
 
ఇదీ బాహుబలి మేనియా.. అయిదేళ్లు అటు నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు, సిబ్బంది ఒక సినిమాకు పెట్టిన అంకిత భావానికి ఫలితం దక్కనున్న ఉద్విగ్న క్షణాలు.. ప్రపంచం ఈ క్షణం కోసమే ఎదురుచూస్తోంది. ఒక సినిమా కోసం మైళ్ల దూరం నుంచి బళ్లు కట్టుకుని మరీ చూసి తరించిన ఆ పాత సంప్రదాయ బాహుబలి ద్వారా మళ్లీ పునరావృతం కానుందా... రాజమౌళి నమ్మకం, నిర్మాతల నమ్మకం నిజం కానుందా..