బెంగుళూరు రేవ్ పార్టీ కేసు : బెంగుళూరు పోలీసుల అదుపులో సినీ నటి హేమ??
టాలీవుడ్ సినీ నటి హేమను బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల బెంగుళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమెకు నిర్వహించిన రక్త పరీక్షల్లో ఆమె డ్రగ్ తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణ కోసం హేమకు బెంగుళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు. తొలుత పంపించిన సమన్లకు ఆమె హాజరుకాలేదు. రెండోసారి సమన్లు జారీ చేయడంతో ఆమె హాజరుకాక తప్పలేదు.
ఈ నేపథ్యంలో ఈ విచారణకు వెళ్లిన హేమను బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఆమె వద్ద విచారణ జరిపిన తర్వాత మంగళవారం బెంగుళూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా, గత నెలలో బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో ఆమెతో పాటు దాదాపు 80 మంది వరకు పాల్గొన్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 60 మంది వరకు డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలింది.