కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్నట్టుండి ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరిగిపోగా, సోడియం స్థాయి మాత్రం పడిపోయాయి. దీంతో ఆయన స్వల్ప అస్వస్థతకు లోనుకావడంతో హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించి అడ్మిట్ చేశారు. అక్కడ ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం వైద్యం అందిస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం దృష్ట్యా కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఈ విషయం తెలిసిన భారాస కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కేసీఆర్ తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
సాధారణ వైద్య పరీక్ష కోసమే తన తండ్రి ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ఆయన ఆరోగ్య సూచికలన్నీ సాధారణంగానే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న శ్రేయోభిలాషులకు, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కాగా, గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కేసీఆర్‌ను గురువారం సాయంత్రం యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచన మేరకు ఆస్పత్రిలో చేర్పించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో కేసీఆర్ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా, సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నట్టు తేలిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.