సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:41 IST)

సర్జికల్ స్ట్రైక్స్‌పై బాలీవుడ్ స్పందన...

ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో మొత్తం 43 మంది సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు. మొదట ఈ ఘటనకు మేము బాధ్యులం కాదు.. భారత్ మాపై నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ ప్రకటించేసి హడావుడి చేసేసిన పాక్, తమ సొంతగూటి ఉగ్రవాద సంస్థ జైషే -ఎ- మొహమ్మద్ తమదే బాధ్యత అని ప్రకటించడంతో తేలు కుట్టిన దొంగలా ఏమీ మాట్లాడలేకపోయింది. 
 
అయితే... ఈ ఉదంతం నేపధ్యంలో భారత్‌లోని అన్ని వర్గాలలోనూ పాక్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అలాగే పాక్‌పై వెంటనే ప్రతీకార దాడి చేయాలనే డిమాండ్ కూడా గట్టిగానే వినిపించింది. తాజాగా మంగళవారం వేకువజామున భారత వాయుసేన పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహిస్తూండడంతో ఈ వార్త తెలుసుకున్న దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు దీనిపై వెంటనే స్పందించి మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నటుడు అనుపమ్‌ఖేర్ ట్విట్టర్ వేదికగా ‘భారత్ మాతాకీ జై’ అని పేర్కొనగా, మరో నటుడు పరేష్ రావల్ ‘నరేంద్ర మోదీగారూ ధన్యవాదాలు... మన సేనా నాయకులకు జయహో’ అని కామెంట్ చేసారు. అలాగే అజయ్ దేవగన్ ‘భారతీయ వాయుసేనకు సలామ్’ అని పేర్కొనగా, అభిషేక్ బచ్చన్ ‘భారతమాతకు వందనాలు’ అని రాయడం జరిగింది.