సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (16:43 IST)

పోస్ట్‌కి నోటు... ‘కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కిన బాలీవుడ్ సెలెబ్రిటీలు

ఓటుకి నోటు అనే పదం గురించి అందరికీ తెలిసిందే అయినప్పటికీ అది సామాన్యులకి... రాజకీయ ప్రముఖులకైతే ఓటుకి సూట్‌కేస్‍ అంటారేమే మరి... తాజాగా వెలుగులోకి వచ్చిన ‘కోబ్రాపోస్ట్ డాట్ కామ్’ అనే ఆన్‌లైన్ పోర్టల్‌కి చెందిన స్టింగ్ ఆపరేషన్‌ బృందం వెలుగులోకి తీసుకువచ్చిన పోస్ట్‌‌కి నోటుని ఏమనాలో జనాలే ఆలోచించుకోవలసి ఉంది.

ప్రజాస్వామ్యం పేరిట ఓట్లు వేసే హక్కుని పొందేసినప్పటికీ... అది ఎవరికి వేయాలి అని సామాజిక మాధ్యమాలలో వాళ్లు వీళ్లు చేసిన పోస్ట్‌లనీ లేదా తమ అభిమాన నటులు సూచించిన వారికి ఓట్లు వేసేసే ప్రతి ఒక్కరూ ఆలోచించుకునేలా చేసే ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాలలోకి వెళ్తే... లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసేందుకు గానూ కొందరు సినీ ప్రముఖులు డబ్బు తీసుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. పార్టీలకు అనుకూలంగా పోస్టులు పెట్టేందుకు ఒప్పుకొని 36 మంది బాలీవుడ్ ప్రముఖులు కెమెరాకు అడ్డంగా బుక్ అయ్యారు. వీరిలో జాకీష్రాఫ్, సోనూసూద్, వివేక్ ఒబెరాయ్, కైలాశ్ ఖేర్ ఉన్నారు. కోబ్రాపోస్ట్ విలేఖరులు ప్రజాసంబంధాల ప్రతినిధులమని చెప్పుకుంటూ.. సినీ, టీవీ నటులు, గాయకులు తదితరులను వారి మేనేజర్ల ద్వారా వారిని సంప్రదించారు.
 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాము సూచించిన రాజకీయ పార్టీకి అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడితే చాలనీ ప్రతిపాదించగా దీనికి 36 మంది ప్రముఖులు అంగీకరించారు. ‘‘అత్యాచారం, వంతెనలు కూలడం వంటి వివాదాస్పద అంశాల్లో వీరు ప్రభుత్వాన్ని సమర్థించడానికి అంగీకరించారు. ఈ ప్రచారాన్ని కప్పి పుచ్చడానికి ఏదో ఉత్పత్తులకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు ఒక డమ్మీ కాంట్రాక్టుపై సంతకం చేయడానికి కూడా వారు సిద్ధపడ్డారు’’ అని కోబ్రాపోస్ట్‌ ముఖ్య సంపాదకుడు అనిరుద్ధ బహల్‌ తెలియజేసారు. ఒక్కో పోస్ట్‌కు రూ.2 లక్షల నుంచి 50 లక్షల వరకూ డిమాండ్ చేసారని కూడా తెలియజేసిన ఆయన ఇందుకుగానూ 8 నెలల కాంట్రాక్ట్ కోసం రూ.20 కోట్లు అడిగిన వారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. 
 
అయితే విద్యాబాలన్, సౌమ్య టాండన్, అర్షద్ వార్సి, రజా మురాద్ మాత్రం ఈ ఒప్పందానికి ససేమిరా ఒప్పుకోలేదని బహల్ తెలిపారు. కాగా ఒప్పుకున్న ప్రముఖులు వరుసగా పెట్టిన ట్వీట్స్, స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన వీడియోలను ఈ మీడియా పోర్టల్ విడుదల చేసింది. కాగా ఈ విషయమై స్పందించిన సోనూసూద్.. వీడియోలోని తన మాటలలో మార్పులు చేసారని, కొన్ని అంశాలనే ఉపయోగించుకుంటూ తనను చెడుగా చూపించేందుకు ప్రయత్నించారనీ ఆరోపించారు. 
 
డబ్బు తీసుకొని ట్వీట్లు చేయడానికి అంగీకరించినవారిలో అమీషా పటేల్‌, సన్నీ లియోన్‌, శ్రేయస్‌ తల్పడే, రాఖీ సావంత్‌, శక్తి కపూర్‌, పంకజ్‌ ధీర్‌, ఆయన కుమారుడు నికితిన్‌ ధీర్‌, కోయినా మిత్రా, పునీత్‌ ఇస్సార్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌, మిన్నిసా లాంబ, టిస్కా చోప్రా, మహిమా చౌధురి, రాహుల్‌ భట్‌, రోహిత్‌ రాయ్‌, అమన్‌ వర్మ, గాయకులు దలేర్‌ మెహందీ, మికా, అభిజిత్‌ భట్టాచార్య, బాబా సెహ్‌గల్‌, నృత్య దర్శకుడు గణేశ్‌ ఆచార్య, హాస్య నటులు రాజ్‌పాల్‌ యాదవ్‌, రాజు శ్రీవాస్తవ, కృష్ణ అభిషేక్‌, విజయ్‌ ఈశ్వర్‌లాల్‌ పవార్‌ తదితరులు ఉన్నారనీ ఈ పోర్టల్ తెలియజేసింది.