బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (14:44 IST)

ఎస్పీబీకి చిరంజీవి స్మృత్యంజలి... భావోద్వేగానికి గురైన మెగాస్టార్...

గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తొలి జయంతి వేడుకలు శుక్రవారం జరిగాయి. భౌతికంగా ఆయన దూరమైన తర్వాత జరిగిన తొలి వేడుకలు ఇవి. గత యేడాది కరోనా వైరస్ బారినపడిన ఎస్పీబీ సెప్టెంబరు నెల 25వ తేదీన కన్నుమూశారు. 
 
అయితే, ఎస్పీబీ ఈ లోకంలో లేకపోయినా పాట రూపంలో ఎప్పటికీ నిలిచిపోతారన్నది అందరి మాట. అలాంటి ఎస్పీ బాలు 75వ జయంతి జూన్ 4వ తేదీ. ఈ నేపథ్యంలో, సినీ ప్రముఖులు బాలు జయంతి సందర్భంగా ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని చెమర్చిన కళ్లతో అశ్రునివాళులు అర్పిస్తున్నారు.
 
అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఈయన బాలుతో తనకున్న ఆత్మీయతను ఓ వీడియోలో వివరించారు. ఆయనను తాను ఎస్పీ బాలు గారూ అంటుండడంతో ఎంతో బాధపడ్డారని, ఎప్పుడూ నోరారా అన్నయ్య, నువ్వు అనేవాడివి ఇవాళ బాలు గారూ అంటున్నావేంటి అని చిరుకోపం ప్రదర్శించారని చిరంజీవి వివరించారు.
 
'బాలు గారూ అంటూ మర్యాదగా పిలిచి నన్ను దూరం చేస్తున్నావా అన్నారు. మీ ఔన్నత్యం తెలిశాక మీలాంటి వారిని ఏకవచనంతో సంబోధించడం సరికాదనుకుంటున్నానని చెప్పడంతో, అలా పిలిచి నన్ను దూరం చెయ్యకయ్యా అన్నారు. కానీ, ఇవాళ మనందరికీ అన్యాయం చేసి ఆయన దూరమయ్యారు" అంటూ చిరంజీవి భావోద్వేగాలకు లోనయ్యారు.
 
అంతేకాదు, ఈ వీడియోలో ఎస్పీ బాలు సోదరి ఎస్పీ వసంత ఆలపించిన గీతాలను కూడా పొందుపరిచారు. అనితర సాధ్యుడు, మహాగాయకుడు, ప్రియసోదరుడైన బాలుగారికి ఓ చెల్లి అశ్రునీరాజనం అంటూ చిరంజీవి ఈ వీడియోను ట్విట్టరులో పంచుకున్నారు.