మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (21:06 IST)

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు...

ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు. ఇటీవల కరోనా వైరస్ బారినపడి హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ఆదివారం రాత్రి 7.44 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. 
 
కరోనా వైరస్ బారిన శివశంకర్‌కు ఊపరితిత్తులు 75 శాతం మేరకు ఇన్ఫెక్షన్ అయ్యాయి. దీంతో ఆయన గత కొన్ని రోజులుగా ఐసీయు వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. అదేసమయంలో వైద్యం చేయించేందుకు డబ్బులు కూడా లేవని చిన్న కుమారుడు అజయ్ కృష్ణ చేసిన విజ్ఞప్తితో అనేక మంది సినీ సెలెబ్రిటీలు కూడా ఆర్థిక సాయం చేశారు. వీరిలో బాలీవుడ్ నటుడు సోనూసూద్, మెగాస్టార్ చిరంజీవి, తమిళ స్టార్ హీరో ధనుష్ తదితరులు ఉన్నారు. 
 
అయితే, అందరినీ విషాదానికి గురిచేస్తూ ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరితో సఖ్యతతో మెలిగే శివశంకర్ మాస్టర్ మృతితో టాలీవుడ్‌, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. 
 
కాగా, ఈయనకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్, శివశంకర్ మాస్టార్ సతీమణి కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిద్దరూ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, 72 సంపత్సరాల శివశంకర్ 10 భాషల్లో 800కు పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. తెలుగులో మగధీర చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నారు. ఈయన 1975 నుంచి చిత్రసీమలో కొనసాగుతున్నారు.