థాయిలాండ్‌లో కోతుల పండుగ - టన్నుల కొద్దీ పండ్లు
సాధారణంగా జనావాస ప్రాంతాల్లోకి వచ్చే కోతులను కర్రలతో తరుముతుంటాం. కానీ, అక్కడ మాత్రం ఆ కోతులతో ఒక పెద్ద పండుగను నిర్వహిస్తారు. ఈ కోతులన్నీ ఒక చోట చేరిన ప్రాంతంలో మంకీ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. థాయిలాండ్‌లోని లోప్‌బురి అనే ప్రాంతంలో ఈ మంకీ ఫెస్టివల్‌ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
నిజానికి గత రెండు సంవత్సరాలుగా ఈ కోతుల పండుగ నిర్వహించలేదు. కానీ, ఇపుడు కరోనా వ్యాప్తి చాలా మేరకు సద్దుమణగడంతో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మంకీ ఫెస్టివల్‌లో భాగంగా, కోతుల కోసం రెండు టన్నుల వివిధ రకాలైన పండ్లు, కూరగాయలను పండుగ జరిగే ప్రాంతానికి తరలిస్తారు.
ఈ ప్రాంతానికి వివిధ జాతులకు చెందిన కోతులు వచ్చి పుష్టిగా ఆరగించి వెళతాయి. ఈ పండుగను తిలకించేందుకు వచ్చే పర్యాటకుల భుజాలపైకి ఎక్కి, వారు పెట్టే ఆహారాన్ని ఆరగిస్తూ సరదాగా గడుపుతాయి. ఈ ప్రాంతంలో ఉండే స్థానికులు దీన్ని ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ కోతుల ఫెస్టివల్ ద్వారా వచ్చే నిధులతో ఈ యేడాది 100 మందికి వీల్ చైర్లను ఉచితంగా అందించనున్నారు.