శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (20:56 IST)

జాతీయ అవార్డు గ్రహీత, 'బాహుబలి' కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కోవిడ్‌తో కన్నుమూత

జాతీయ అవార్డు గ్రహీత కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కోవిడ్-19తో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. COVID-19 బారిన పడిన వెంటనే డ్యాన్స్ మాస్టర్ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. గత కొన్నిరోజులుగా ఆయనకు చికిత్స అందిస్తూ వచ్చారు. ఐతే ఆయన ఆరోగ్యం క్షీణించి ఈరోజు తుదిశ్వాస విడిచారు ఆయన వయస్సు 72. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


సోనూసూద్, ధనుష్, మెగాస్టార్ చిరంజీవి తదితర నటులు కొరియోగ్రాఫర్ చికిత్స కోసం శివశంకర్ చిన్న కుమారుడు అజయ్‌కు ఆర్థిక సహాయం అందించారు. 'మగధీర’లోని ‘ధీర ధీర’ పాటకు కొరియోగ్రఫీకి గానూ జాతీయ అవార్డు అందుకున్నారు. అతని ప్రసిద్ధ తెలుగు సినిమాలలో ‘అమ్మోరు’, ‘అరుంధతి’, ‘మహాత్మ’, ‘బాహుబలి ది బిగినింగ్’ ఉన్నాయి.
 
 
1948లో చెన్నైలో జన్మించిన శివశంకర్ మాస్టర్ తమిళ చిత్రాలలో తన వృత్తిని ప్రారంభించారు. అయితే ఆయన అన్ని భారతీయ భాషల సినిమాలలో పనిచేశారు. 'ఢీ', 'ఆటా జూనియర్స్' వంటి తెలుగు టీవీ డ్యాన్స్ షోలతో కొత్త తరం ప్రేక్షకులలోనూ ఆయన ప్రజాదరణ పొందాడు.