మురుగదాసో, ఇంకో దాసో అంటారే తప్ప మన దాసుల పేర్లు చెప్పరేం : దాసరి సంచలన కామెంట్స్
దర్శకరత్న దాసరి నారాయణ రావు సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ భావదారిద్ర్యంలో మునిగిపోయిందంటూ ఘాటైన విమర్శలు చేశారు.
దర్శకరత్న దాసరి నారాయణ రావు సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ భావదారిద్ర్యంలో మునిగిపోయిందంటూ ఘాటైన విమర్శలు చేశారు. 'పెళ్లిచూపులు' చిత్రం సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోల వైఖరిని తూర్పారబట్టారు. హీరోలకు ఈగో పెరిగిపోయిందంటూ మండిపడ్డారు.
అభిమాన దర్శకులు ఎవరని ప్రశ్నిస్తే, ఇక్కడ ఉన్న రాజమౌళి, రాఘవేంద్రరావు, విశ్వనాథ్ వంటి గొప్ప దర్శకుల పేర్లు చెప్పకుండా పరాయి భాషలకు చెందిన ఏ మురుగదాసో, ఇంకో దాసో అంటున్నారని, లేకుంటే హిందీవాళ్లు, ఇంగ్లీష్ వాళ్ల పేర్లు చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎందరో గొప్పవాళ్లున్నా వారి పేర్లు చెప్పేందుకు మనసు రావడం లేదని, ఇది ఒక్క తెలుగు పరిశ్రమకు మాత్రమే చుట్టుకున్న జబ్బని అన్నారు. పెద్ద సినిమాలను వేల థియేటర్లలో విడుదల చేస్తున్న నిర్మాతలపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. చాలా మందికి పిచ్చి పట్టిందని, తొలి రోజున 500, 1000 థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తే, నాలుగో రోజుకు ఎవరు చూస్తారని పశ్నించారు.