బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (20:55 IST)

మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది : ధీర దర్శకుడు విక్రాంత్ శ్రీనివాస్

Dheera director Vikrant Srinivas
Dheera director Vikrant Srinivas
వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాలతో లక్ష్ చదలవాడ హిట్టు కొట్టారు. ఇక ఫిబ్రవరి 2న ‘ధీర’ అంటూ వచ్చిన మరో విజయాన్ని అందుకున్నారు. లక్ష్ చదలవాడ, సోనియా భన్సాల్, నేహా పఠాన్‌లు నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 2న విడుదలైంది. ఈ చిత్రాన్ని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు.  విక్రాంత్ శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే విజయం సాధించిన విక్రాంత్ శ్రీనివాస్ తన సంతోషాన్నీ మీడియాతో పంచుకున్నారు. ఈ క్రమంలో ధీర విశేషాలను చెప్పుకొచ్చారు.
 
చిన్నతనం నుంచీ చదవుల్లో ఫస్ట్ ఉండేవాడిని. ఉస్మానియాలో జర్నలిజంలో మాస్టర్స్ చేశాను. గోల్డ్ మెడల్ కూడా సాధించాను. అయితే సినిమాల మీదున్న ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చాను. అసిస్టెంట్ రైటర్‌గా జర్నీ ప్రారంభించాను. ఎన్నో చిత్రాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. బలుపు, డాన్ శీను, ధృవ, సైరా, ఏజెంట్ ఇలా చాలా చిత్రాలకు పని చేశాను. లక్ష్ నటించిన గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమాకి సైతం రైటర్‌గా పని చేశాను.
 
సురేందర్ రెడ్డి గారి వద్ద ఏజెంట్‌కు పని చేస్తున్న టైంలోనే లక్ష్‌ను కలిసి ధీర కథను చెప్పాను. డైరెక్షన్ సైడ్ వెళ్తున్నాను అని సురేందర్ రెడ్డి గారికి చెప్పి వెళ్లాను. అలా ధీర చిత్రానికి సంబంధించిన జర్నీ ప్రారంభం అయింది. ఈ సినిమా కథను సింగిల్ సిట్టింగ్‌లోనే లక్ష్ ఓకే చేశారు.
 
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌‌లో ఇది వరకు ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. అలాంటి పెద్ద బ్యానర్‌లో నా మొదటి చిత్రం రావడం ఆనందంగా ఉంది. హీరోగా, నిర్మాతగా లక్ష్ నాకు ఎంతో సహకారాన్ని అందించారు. ధీరకు సంబంధించిన ప్రతీ విషయంలో లక్ష్ ఎంతో తోడుగా నిలిచారు.
 
లక్ష్ చిన్నతనం నుంచి సినిమాల మీద ప్యాషన్‌తోనే ఉండేవారు. హీరోగానూ కొన్ని సినిమాలు చేశారు. మధ్యలో బిజినెస్ చూసుకున్నారు. ఆ తరువాత బిచ్చగాడు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత అదే జోష్‌లో వలయం, గ్యాంగ్ స్టర్ గంగరాజు అంటూ విజయాలు అందుకున్నారు. ధీర చిత్రానికి నాకు మంచి కటౌట్ ఉన్న హీరో కావాలనుకుని లక్ష్‌కు ఈ కథ చెప్పాను. ధీర చిత్రంలో లక్ష్ చక్కగా నటించారు. హీరోగా, నిర్మాతగా అన్ని బాధ్యతలు నిర్వర్తించారు.
 
కథ డిమాండ్ మేరకే ఇద్దరు హీరోయిన్లను పెట్టాను. ఇద్దర్ని ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ రెండు పాత్రలకు సోనియా, నేహా పఠాన్‌లు న్యాయం చేశారు. హీరోయిన్లు ఇద్దరూ చక్కగా నటించారు. హిమజ, సుమన్ ఇలా అన్ని పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
 
ఫిబ్రవరి 2న మా సినిమాను దిల్ రాజు గారు నైజాం, వైజాగ్ ఏరియాల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. అది మాకు చాలా హెల్ప్ అయింది. మా టీం అంతా కలిసి ఫిబ్రవరి 2న సంధ్యలో సినిమాను చూశాం. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి మాకు ఎంతో సంతోషమేసింది. మా చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అందరూ విజిల్స్, చప్పట్లతో థియేటర్లో గోల చేశారు. మా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం నాకు ఆనందంగా ఉంది.