శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 8 జులై 2016 (18:22 IST)

నిరవధిక నిరాహార దీక్షలో 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' టీమ్‌

మోడరన్‌ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్‌ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన యూత్‌ఫుల్‌ హారర్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 8న రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 150 థియేటర్లల

మోడరన్‌ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్‌ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన యూత్‌ఫుల్‌ హారర్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 8న రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 150 థియేటర్లలో రిలీజ్‌ చేయడానికి సిద్ధమయ్యారు. నైజాంలో బిందు పిక్చర్స్‌ శ్రీనివాస్‌ ద్వారా ఈ చిత్రం రిలీజ్‌ అయింది. అయితే రిలీజ్‌ ముందు రోజు వరకూ 30 థియేటర్లలో రిలీజ్‌ చేస్తానని చెప్పి, రిలీజ్‌ రోజు ఉదయానికి హైదరాబాద్‌లో ఒకే ఒక్క థియేటర్‌లో అదీ రెండు షోలు మాత్రమే వేస్తామని చెప్పడంతో దర్శకనిర్మాతలు ఆదిత్య ఓం, విజయ్‌వర్మ ఆశ్చర్యపోయారు. 
 
ముందు రోజు వరకు 30 థియేటర్లు ఇస్తానని చెప్పి సడన్‌గా హైదరాబాద్‌లో ఒకే ఒక్క థియేటర్‌ ఇవ్వడంతో తమకు జరిగిన అన్యాయానికి నిరసనగా యూనిట్‌ సభ్యులతో కలిసి ఫిలిం ఛాంబర్‌ ముందు నిరాహార దీక్షను ప్రారంభించారు దర్శకనిర్మాతలు. దీనికి కొంతమంది చిన్న నిర్మాతలు మద్దతును ప్రకటించారు. భారత్‌ ఎక్తా ఆందోళన్‌ నేషనల్‌ కన్వీనర్‌ మల్లు రమేష్‌ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' టీమ్‌ చేస్తున్న దీక్షకు మద్దతును ప్రకటించారు. 
 
ఫిలింఛాంబర్‌ ఇ.సి. మెంబర్‌ అశోక్‌కుమార్‌, జనరల్‌ సెక్రటరీ దామోదర ప్రసాద్‌ ఈ సమస్యను పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనికి శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ దీక్ష కొనసాగుతుందని ఆదిత్య ఓం, విజయ్‌వర్మ స్పష్టం చేశారు. నిరాహార దీక్షా శిబిరానికి విచ్చేసిన వారిలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కె.సురేష్‌బాబు, మోహన్‌గౌడ్‌ తదితరులు వున్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ - ''దాదాపు రెండున్నర సంవత్సరాలు కష్టపడి నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఒక యూత్‌ఫుల్‌ మూవీ తీశాను. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చివరికి ఈరోజు సినిమాని రిలీజ్‌ చేశాను. రిలీజ్‌కి ముందు సోషల్‌ మీడియాలో మా చిత్రాన్ని బాగా ప్రమోట్‌ చేశాము. సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌ అంతా సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఎదురుచూశారు. కానీ, వారికి సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది. 
 
రెండు రాష్ట్రాల్లో కలిపి 150 థియేటర్లలో సినిమా రిలీజ్‌ అవ్వాల్సి వుండగా కేవలం 30 థియేటర్లలో మాత్రమే రిలీజ్‌ అయింది. రిలీజ్‌ అయిన థియేటర్లలో సూపర్‌హిట్‌ టాక్‌తో సినిమా రన్‌ అవుతోంది. సిటీలోగానీ, నైజాంలోగానీ ఆ పరిస్థితి లేదు. సిటీలో ఒకే ఒక్క థియేటర్‌లో రిలీజ్‌ చేసి మేం ఎప్పటికి 4 కోట్లు సంపాదించాలి. ఈ నిరాహార దీక్ష చేస్తున్నది థియేటర్ల కోసమే. మాకు మినిమం థియేటర్స్‌, మినిమం షోలు ఇవ్వాలని కోరుతున్నాం'' అన్నారు.
 
సహ నిర్మాత విజయ్‌వర్మ మాట్లాడుతూ - ''థియేటర్ల విషయంలో ముందు రోజు ఒకలా, మరుసటి రోజు మరోలా డిస్ట్రిబ్యూటర్లు ప్రవర్తిస్తున్నారు. కొంత మంది స్వార్థపరుల వల్ల చిన్న సినిమాలు బలైపోతున్నాయి. ప్రాంతీయ భాషా చిత్రాల రిలీజ్‌ విషయంలో ఫిలింఛాంబర్‌, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. మహారాష్ట్రలో మాదిరిగా ప్రాంతీయ చిత్రాలకు తప్పసరిగా థియేటర్లు ఇవ్వాలి అనే నిబంధన విధిస్తేగానీ తెలుగు సినిమా బ్రతకదు. ఈ నిబంధన మన రాష్ట్రంలోనూ వచ్చే వరకూ మా పోరాటం ఆగదు. మాలాగా మరి ఏ నిర్మాతకి కూడా ఇలాంటి సమస్య రాకూడదన్న ఉద్దేశంతో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయబోతున్నాం. మాకు చిన్న నిర్మాతలు అందరూ మద్దతుగా నిలబడ్డారు'' అన్నారు.