ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు
హైదరాబాదులో Bonalu సందర్భంగా మటన్ తెచ్చుకుని తినగా మిగిలినదాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని మరుసటి రోజు వేడి చేసుకుని తిన్నారు. అంతే... తిన్న వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఫ్రిజ్‌లో పెట్టిన మాంసాహారం విషపూరితం కావడం వల్లనే ఇలా జరిగినట్లు చెబుతున్నారు.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. వనస్థలిపురంలో నివాసం వుంటున్న ఆర్టీసి కండక్టర్ శ్రీనివాస్ ఆదివారం నాడు బోనాలు సందర్భంగా మటన్ తెచ్చుకుని తిన్నారు. ఆరోజు వారు తినగా మిగిలినది ఫ్రిజ్‌లో పెట్టుకున్నారు. దాన్ని మంగళవారం బైటకు తీసి పొయ్యి మీద కాస్త వేడి చేసుకుని తిన్నారు. అంతే.. మటన్ తిన్న 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆర్టీసి కండక్టర్ శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారి అతడు మృత్యువాత పడ్డాడు. వారు తిన్న మాంసం విషపూరితం కావడం వల్లనే ఇలా జరిగిందని వైద్యులు తేల్చారు. అందువల్లనే ఒకసారి వండిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో పెట్టరాదు, అలా పెట్టుకుని తిరిగి వేడి చేసి తింటే అది హానికరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.