మంగళవారం, 14 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 24 జులై 2020 (23:58 IST)

తెలుగు వెండితెర‌కు బంగారు న‌ట‌నా నిధి కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, బర్త్ డే స్పెషల్ ఆర్టికల్

కైకాల స‌త్య‌నారాయ‌ణ‌గారు.. తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్ళ‌కు పుట్టారు. తెలుగు సినిమాతో స‌మాంత‌రంగా ఎదిగారు.. న‌టుడుగా గ‌త ఏడాదికే ష‌ష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా భ‌క్త‌ప్రహ్లాద విడుద‌లయితే.. 1935 జులై 25న స‌త్య‌నారాయ‌ణ జ‌న్మించారు. 1959లో ఆయ‌న న‌టించిన చిత్రం సిపాయి కూతురు విడుద‌ల‌యింది.
 
ఆ ర‌కంగా ఆయ‌న న‌టుడు అయి.. 61 సంవ‌త్స‌రాలు కాగా.. వ్య‌క్తిగ‌తంగా ఈ ఏడాది జులై 25కి 85వ సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటున్నారు. తెలుగు సినిమా అభిమానులు అంద‌రికీ స‌త్య‌నారాయ‌ణ జీవిత చ‌రిత్ర సినిమా విశేషాలు తెలిసిన‌వే. అయినా సింహావ‌లోక‌నం చేసుకుందాం. 
హీరోగా సినిమా రంగానికి ప‌రిచ‌యం అయినా.. ఆ సినిమా నిరాశ‌ప‌ర్చ‌డంతో విల‌న్‌గా మార‌డానికి త‌ట‌ప‌టాయించ‌లేదు.
 
జాన‌ప‌ద బ్ర‌హ్మ విఠ‌లాచార్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎన్నెన్నో జాన‌ప‌ద చిత్రాల్లో స‌త్య‌నారాయ‌ణ విల‌న్ పాత్ర‌లు పోషించారు. ఆ త‌ర్వాత సోష‌ల్ పిక్చ‌ర్స్‌లో కూడా విల‌న్ పాత్ర‌లు వ‌చ్చాయి. స‌త్య‌నారాయ‌ణ న‌వ్వు పాపుల‌ర్ విల‌నీ ట్రేడ్ మార్క్ అయింది. కెరీర్ తొలిద‌శ‌లోనే ఆయ‌న‌కి పౌరాణిక పాత్ర‌లు చేసే అవ‌కాశం ల‌భించింది. ల‌వ‌కుశ‌లో భ‌ర‌తుడిగా.. శ్రీకృష్ణార్జున యుద్ధంలో క‌ర్ణుడిగా.. న‌ర్త‌న‌శాల‌లో దుశ్శాస‌నుడిగా న‌టించారు. శ్రీకృష్ణ‌పాండ‌వీయంలో ఘ‌టోత్క‌చుడి పాత్ర తొలిసారి ధ‌రిస్తే మ‌ళ్ళీ 1995లో ఎస్‌.వి.కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఘ‌టోత్క‌చుడు చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించారు.
శ్రీకృష్ణావ‌తారం చిత్రంలో తొలిసారి దుర్యోధ‌నుడి పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత కురుక్షేత్రంలో దుర్యోధ‌నుడిగా అద్భుతంగా ర‌క్తి క‌ట్టించారు. అలాగే రావ‌ణాసురుడిగా సీతాక‌ళ్యాణంలో.. భీముడిగా దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌లో.. మూషికాసురుడిగా శ్రీ వినాయ‌క విజ‌యం చిత్రాల్లో న‌టించారు. చాలామందికి తెలియ‌ని విశేష‌మేమిటంటే క‌థానాయిక మొల్ల‌లో శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు పాత్ర పోషించారు. య‌మ‌ధ‌ర్మ‌రాజు అంటే తెలుగుతెర‌కి స‌త్య‌నారాయ‌ణ త‌ప్ప మ‌రొక‌రు గుర్తురారు.
 
య‌మ‌గోల సినిమాతో ప్రారంభ‌మైన ఈ పాత్ర జైత్ర‌యాత్ర య‌ముడికి మొగుడు.. య‌మ‌లీల‌.. రాధామాధ‌వ్‌.. ద‌రువు చిత్రాల వ‌ర‌కూ సాగింది. మోస‌గాళ్ళ‌కు మోస‌గాడు.. దొంగ‌ల వేట మొద‌లైన సినిమాల్లో ఆయ‌న విల‌న్ పాత్ర‌లు మ‌ర్చిపోలేనివి.  ఉమ్మ‌డి కుటుంబం.. దేవుడు చేసిన మ‌నుషులు.. శార‌ద చిత్రాల‌తో ఆయ‌న ఇమేజ్ మారింది. సాత్విక‌మైన పాత్ర‌ల‌కు కూడా స‌త్య‌నారాయ‌ణ బెస్ట్ ఆప్ష‌న్ అయ్యారు.
 
తాత‌..మ‌న‌వడు, సంసారం..సాగ‌రం, రామ‌య్య తండ్రి, జీవిత‌మే ఒక నాట‌క‌రంగం, దేవుడే దిగివ‌స్తే, సిరిసిరి మువ్వ‌, తాయార‌మ్మ‌ బంగార‌య్య, పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌రులు మొద‌లైన చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించి విల‌న్ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌ప‌డి.. కుటుంబ ప్రేక్ష‌కుల‌కు అభిమాన న‌టుడ‌య్యారు. 
 
క‌మెడియ‌న్ న‌గేష్ డైరెక్ట‌ర్‌గా స్టార్ ప్రొడ్యూస‌ర్ డి.రామానాయుడు నిర్మించిన మొర‌టోడు చిత్రంతో హీరోగా మారారు. నా పేరే భ‌గ‌వాన్‌.. ముగ్గురు మూర్ఖులు.. ముగ్గురు మొన‌గాళ్ళు.. కాలాంత‌కులు.. గ‌మ్మ‌త్తు గూడ‌చారులు.. తూర్పు ప‌డ‌మ‌ర.. సావాస‌గాళ్ళు లాంటి చిత్రాల్లో హీరోతో స‌మాంత‌ర‌మైన పాత్ర‌లు పోషించారు స‌త్య‌నారాయ‌ణ‌.
చాణ‌క్య చంద్ర‌గుప్త‌లో రాక్ష‌స‌మంత్రిగా న భూతో న భ‌విష్య‌త్ అన్న‌ట్లు న‌టించారు. నా పిలుపే ప్ర‌భంజ‌నంలో ముఖ్య‌మంత్రి పాత్ర‌తో విస్మ‌య‌ప‌రిచారు. ఒక‌టా.. రెండా వంద‌లాది చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. 
 
సుభాష్ ఘాయ్ డైరెక్ట్ చేసిన హిందీ సినిమా క‌ర్మ‌లో విల‌న్‌గా న‌టించారు. ఈ సినిమాలో శ్రీదేవి తండ్రి పాత్ర ధ‌రించారు. ఒక‌టీ.. రెండు తెలుగు డైలాగ్స్ కూడా ఆ సినిమాలో చెప్పారు స‌త్య‌నారాయ‌ణ‌. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్‌లతో కొన్ని చిత్రాలతో పాటుగా కన్నడ, హిందీ సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ గారు నటించడం జరిగింది.

కైకాల స‌త్య‌నారాయ‌కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉమ్మ‌డి ప్ర‌భుత్వం ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డ్‌తో గౌర‌వించుకుంది. ఆ మ‌ధ్య విడుద‌ల‌యిన మ‌హ‌ర్షి చిత్రంలో కూడా న‌టించారు స‌త్య‌నారాయ‌ణ‌. త‌ను న‌టించిన ప్ర‌తీ పాత్రా త‌న సొంత బిడ్డ‌లాగే భావించి.. వాటికి ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. ప్ర‌స్తుతం 85 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఇంట్లో ప్ర‌శాంత‌మైన జీవ‌నాన్ని గ‌డుపుతూ.. పాత సినిమాలు చూస్తూ.. ఆనందంగా కాల‌క్షేపం చేస్తున్నారు స‌త్య‌నారాయ‌ణ‌. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుదాం.