గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2024 (12:27 IST)

ఆ సినిమా చూసి ఓ వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు : హీరో సూర్య

surya
తాను హీరోగా నటించిన "కాక్క కాక్క" చిత్రం చూసి ప్రేరణ పొందిన ఓ యువకుడు ఏకంగా ఐఏఎస్ అధికారి అయ్యారని తమిళ నటుడు సూర్య తెలిపారు. అలాగే, తాను నటించిన "జైభీమ్" చిత్రం తర్వాత ఓ వర్గానికి చెందిన 3 లక్షల మందికి ఇంటి పట్టాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. 
 
ఆయన హీరోగా నటించిన చిత్రం 'కంగువ'. ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. దిశా పటాని కథానాయిక. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, సూర్య గురువారం నాడు హైదరాబాద్ నగరానికి చ్చారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. 
 
'నటుడిగా కమల్ హాసన్‌ను చూసి ప్రేరణ పొందుతుంటాను. మంచి సినిమాలు సమాజంలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. నేను నటించిన "కాక్క కాక్క" సినిమా చూసి ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. "జైభీమ్" సినిమా తర్వాత తమిళనాడులో 3 లక్షల మందికి ఇంటి పట్టాలు వచ్చాయి. ఇలాంటివి మనసుకు ఎంతో సంతోషానిస్తాయి" అని చెప్పుకొచ్చారు. 
 
అలాగే, 'తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా మీకోసం, మీకు ఓ మంచి సినిమా అనుభూతిని ఇవ్వాలనే లక్ష్యంతో చేసిన సినిమా "కంగువ". ఇలాంటి సినిమాలు చేసేందుకు దర్శకుడు రాజమౌళి స్ఫూర్తినిచ్చారు. కంగువా ఒక పైటర్ సినిమా కాదు ఒక వారియర్ మూవీ. తన వాళ్ల కోసం, తను నమ్మిన ధర్మం కోసం పోరాడే వారియర్ మూవీ' అని వివరించారు. 
 
'యువరత్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నాను. ఆయనతో ఆ షో చేయడం మర్చిపోలేని అనుభవం. ఆయన క్రమశిక్షణ, కష్టపడే తత్వం, అంకితభావం చూశాక అందుకే అంత గొప్ప స్థాయికి వెళ్లారనిపించింది' అన్నారు. 
 
చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ, "వెయ్యేళ్ల క్రితం ఆది మానవుల టైమ్ నుంచి ఐదు తెగల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ట్రైలర్ అందరికి ఎంత నచ్చిందో, రేపు సినిమా కూడా దానికి మించిన విధంగా నచ్చుతుంది. రాజమౌళి స్పూర్తితో ఈ సినిమా చేశాను. ఆయన "విక్రమార్కుడు" చిత్రాన్ని నేను తమిళంలో 'సిరుతై' పేరుతో రీమేక్ చేశాను. ఆ సినిమా నాకు సక్సెస్ ఇవ్వడంతో పాటు నా ఇంటి పేరు ముందు "సిరుతై" చేరింది. తప్పకుండా ఈ చిత్రం మీ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది" అన్నారు.