1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 8 జూన్ 2016 (12:37 IST)

సోషల్ మీడియాలో ''ఐ హేట్ హీరోస్'' హల్‌చల్... నోరు మెదపని టాలీవుడ్ హీరోలు!

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, 'మన్మథుడు' నాగార్జున, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రాం చరణ్ తేజ్, వరుణ్ తేజ్ వీరందరు నటవారసత్వం నుంచి వచ్చిన వారే.. కానీ వీరిలో ఒక చిరంజీవి మాత్రమే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు పరిశ్రమలో స్థిరపడిన హీరో. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా యాక్టింగ్ టాలెంట్‌తో టాప్ హీరోలుగా అంచెలంచెలుగా ఎదిగారు. అభిమానుల గుండెల్లో అభిమాన హీరోలుగా నిలిచిపోయారు. అందరూ ఆరాధించే ఈ హీరోలపై ఓ ఇద్దరు యువకులు మాత్రం కారాలు మిరియాలు నూరుతున్నారు. 
 
టాలీవుడ్ టాప్ హీరోలను చులకన చేసి మాట్లాడారు. అంతేకాదు వారికి యాక్టింగే చేతకాదని దుమ్మెత్తిపోశారు. తెలుగులో ఇప్పుడున్న అగ్ర హీరోలంతా యాక్టింగ్ రాని వాళ్ళని కేవలం బ్యాక్‌గ్రౌండ్‌నే నమ్ముకుంటూ బతుకుతున్నారని ఆ ఇద్దరు యువకులు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ''ఐ హేట్ హీరోస్'' పేరుతో వారు తీసిన ఈ వీడియోలో టాప్ స్టార్ల ఫోటోలను తగులబెడుతూ.. వారిని విమర్శిస్తూ పాడిన పాటను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. తమ అభిమాన హీరోల ఫోటోలు అలా తగులబెడుతూ.. వారికి నటన రాదని విమర్శిస్తూ పాడటంపై ఆ హీరోల అభిమానులు మండిపడుతున్నారు. మరి ఈ వీడియోపై హీరోలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.