ఢిల్లీలో తాగుబోతుల బారిన పడ్డ ప్రాచీ
నటి ప్రాచీ టెహ్లాన్ నటికాకముందు బాస్కెట్‌బాల్ ప్లేయర్. ఆమె ఆటకు దిగితే క్వీన్ ఆఫ్ కోర్ట్ అనేవారు. అంత అందంగా వున్న ఆమె నటనపై మక్కువతో పంజాబీలో సినిమాలో మొదటగా నటించింది. ఇక మలయాళంలో మమ్ముట్టి తదితరులు నటించిన చారిత్రాత్మక సినిమా `మమంగం`లో రాజ నర్తకిగా మైమరిపించింది. అయితే టీవీ షోలుకూడా చేసిన ఆమెకు ఇటీవలే ఓ చేదు అనుభవం ఎదురైందట. తన జీవితంలోని ఓ భయం కలిగించే అనుభవాన్ని ఇలా చెబుతోంది.
ఓరోజు తను రాత్రి కారులో ఇంటికి వెళ్తున్నప్పుడు కొందరు తాగుబోతులు తనను వెంబడించారని తెలిపింది. ఆ సమయంలో తన భర్త కూడా కారులో ఉన్నాడని, అయినప్పటికీ వాళ్లు తమను అనుసరించడం మానుకోలేదని, ఏకంగా మా ఏరియాలోకి వచ్చేశారని పేర్కొంది. అప్పుడు చాలా భయపడ్డానన్న ప్రాచీ ఆ సమయంలో వాళ్ల దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయోనని బిక్కుబిక్కుమంటూ గడిపామని చెప్పింది. ఫ్యామిలీ పార్టీకి వెళ్లి తిరిగొచ్చే క్రమంలో అర్ధరాత్రి రెండు గంటలప్పుడు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని గుర్తు చేసుకుంది.
ఇలా తాగి ఇబ్బందులు పెట్టేవారిని వదలకూడదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత ఏమి జరిగిందనేది వివరించలేదు. అయితే నేను పుట్టి పెరిగిన ఢిల్లీ అందమైన ప్రాంతమే. కానీ అక్కడ అంతఅందమైన మనుషులు లేరనీ, ఢిల్లీ కంటే ముంబై అంతో ఇంతో నయమేనని అంటోంది.