గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (11:50 IST)

ఒక వెలుగు వెలిగి చివ‌రిలో ఆద‌ర‌ణ నోచుకోని తెలంగాణా శ‌కుంత‌ల‌

Shakuntala, Venumadhav
తెలంగాణ శ‌కుంత‌ల‌. ఈ పేరు వింటే. మా ప్రాంతానికి చెందిన న‌టి అని తెలంగాణ‌వాసులు అనుకునేవారు. తెలంగాణ యాస‌ను ఇప్పుడు తెలంగాణ‌లో పుట్టిన వారు సైతం ప‌ల‌క‌లేని స్ప‌ష్ట‌త ఆమె సొంతం. 65వ ఏట‌నే ఆమె కాలం చేశారు. నేడు ఆమె వ‌ర్థంతి. మాహారాష్ట్రంలో పుట్టిన ఆమె తెలుగులో `మాభూమి` సినిమాతో తెరంగేట్రం చేశారు. తెలుగు, హిందీ, త‌మిళ్‌, బోజ్‌పురి భాష‌ల్లో 250పైగా చిత్రాల్లో న‌టించారు. ఒక‌ప్ప‌టి సూర్య‌కాంతంలా అంత‌లా మాట‌ల‌తో మెరుపులు సృష్టించిన న‌టి ఆమె అనే చెప్పాలి. ఎన్నో చిత్రాల్లో న‌టించిన ఆమె ఆర్థికంగా సంపాదించుకున్న‌ది త‌క్కువ‌నే చెప్పాలి. ఎందుకంటే అనారోగ్యంతో ఆమెకు ఆసుప్ర‌తిలో జేర‌డానికి  త‌గినంత డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఆమె గురించి తెలుసుకున్న విజ‌య‌శాంతి కొంత మొత్తాన్ని స‌ర్దారు. ఆరోగ్యంతో బ‌య‌ట ప‌డ్డాక చాలా సంద‌ర్భాల్లో విజ‌య‌శాంతిని గుర్తుచేసుకున్నారు. అస‌లు విజ‌య‌శాంతి తెలంగాణ యాస‌ను ఆమె వ‌ద్ద నేర్చుకోవాల‌ని ఆమెను సంప్ర‌దించ‌డంతో ఆమె ఆర్థిక‌ప‌రిస్థితి బోధ‌ప‌డింది. ఆమె భ‌ర్త ప్ర‌సాద్ విశ్రాంతి ఉద్యోగి. ఆమెకు కుమారుడు, కుమార్తె వున్నారు.
 
సినిమా హిట్‌కు కీల‌కంగా నిలిచారు
త‌ల్లిగా, అక్క‌గా, బామ్మ‌గా ఎటువంటి పాత్ర ఇచ్చిన అందులో త‌న‌దైన ముద్ర చూపేవారు. స్టేజీ అనుభ‌వంతోనే 1979లో `మా భూమి`లో అవ‌కాశం వ‌చ్చింది. అయితే ఆ సినిమా త‌ర్వాత ఆమెకు అంత ఈజీగా తెలుగులో అవ‌కాశాలు రాలేదు. చాలాకాలం ఎదురు చూసింది. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు తేజ `నువ్వు నేను` సినిమాలో ఆమెను తీసుకున్నారు. అందులో తెలంగాణ యాస‌తోపాటు పాత్ర‌కు అనుగుణంగా ఆమె మెప్పించింది. ఇందులో ఆమె ముఖ్య‌పాత్ర పోషించి సినిమా హిట్‌కు కీల‌కంగా నిలిచారు. నువ్వు నేను, రంగుల క‌ల సినిమాల‌కు అవార్డులు ల‌భించాయి. ఆమె న‌టిగా హాస్యాన్ని కూడా పండించేది. సీరియ‌ర్‌గా ఆమె ప‌లికే మాట‌లు, ఎదుటి వాడి చేష్ట‌లు కామెడీని హైలైట్ చేస్తాయి. ల‌క్ష్మీ సినిమాలో ఆమెకూ, వేణుమాధ‌వ్‌కు మ‌ధ్య వున్న స‌న్నివేశాలు ఇప్ప‌టికే టీవీల్లో మ‌ళ్ళీ మ‌ళ్ళీ చూడాల‌నిపించేలా ఆనందాన్నిస్తాయి.
 
న‌వ్వులూ పండించారు
`ఒక్క‌డు` సినిమాలో ప్ర‌కాశ్‌రాజ్‌, ఆమె కాంబినేష‌న్‌లో అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచారు. గంగ్రోతి ,ఎవ‌డిగోల వాడిది. దేశ‌ముద‌రు, బెండు అప్పారావు ఆర్‌.ఎం.పి. సినిమాల్లో త‌న‌దైన శైలిలో న‌వ్వులు పంచారు. ఎవ‌డిగోల వాడిదేలో కృష్ణ‌భ‌గ‌వాన్ భార్య‌గా న‌టించి హాస్యాన్ని పండిస్తే, మ‌రో సినిమాలో సునీల్‌కు అమ్మ‌గా న‌టించి కాలేజీకి వెళ్ళి కొడుకుకు కొట్టిన స‌న్నివేశం ఆనంద‌ప‌రిచేది. ఇలా ఎన్నో భిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషించిన ఆమె పారితోషికంలో ఎక్క‌డా డిమాండ్ చేసేవారు కాదు. చిన్న సినిమాల సైతం వారు ఇచ్చిందే పుచ్చుకునేవారు. కేరెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఆమె ఎంత‌గానో సంపాదించాల్సింది కానీ ఎక్క‌డా బేష‌జాలుకు పోయేవారు కాదు. చివ‌రి వ‌ర‌కు సినిమాలు న‌టిస్తూనే వున్న ఆమె 2014 జూన్ 14న మ‌ర‌ణించారు. ఆమె చివ‌రిసారిగా న‌టించిన చిత్రం `రాజ్యాధికారం` అది ఇంకా విడుద‌ల‌కు నోచుకోలేదు.