మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

నేను చేసే ప్రతి చిత్రం అభిమానుల కోసమే... : జూనియర్ ఎన్టీఆర్

jrntr
యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అభిమానుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ సోషల్‌ మీడియా ద్వారా ఆయనకు విషెస్‌ చెప్పారు. ఇక తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ఎన్టీఆర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ట్విటర్‌ వేదికగా ఒక హృదయపూర్వక లేఖను విడుదల చేశారు.
 
'ఇప్పటి వరకు నేను నటించిన ప్రతి పాత్ర, చేసిన ప్రతి సినిమా నా అభిమానుల కోసమే చేశాను. నన్ను, నా సినిమాలను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాపై మీరు చూపిస్తున్న అచంచలమైన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. 'దేవర' ఫస్ట్‌ లుక్‌కు వచ్చిన అద్భుతమైన స్పందనకు నిజంగా కృతజ్ఞతలు. మీరంతా కలిసి నా పుట్టినరోజును మరింత అందంగా మార్చారు. ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు నా స్నేహితులకు, కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను' అని పేర్కొన్నారు.
 
ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 'సింహాద్రి' చిత్రాన్ని రీరిలీజ్‌ చేశారు. దీంతో మరోసారి సోషల్‌ మీడియాలో ఈ సినిమా పాటలు, డైలాగులు ట్రెండ్‌ అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సుమారు 150కి పైగా థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. మొత్తం 1210 షోలు ప్రదర్శించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌ మెల్‌బోర్న ఐమాక్స్‌ థియేటర్‌లోనూ ఈ మూవీ రీరిలీజ్‌ చేయడం విశేషం.