మణికర్ణిక కథ ఓ అద్బుతం.. అనుకోకుండా నాకు దక్కిన అదృష్టం: గాల్లో తేలుతున్న కంగనా
‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’ నాయికా ప్రాధాన్య పాత్రలను హీరోయిన్‌లకు ఇస్తే ఆ సత్తా ఎలా ఉంటుందో బాలీవుడ్ బాక్సాఫీసుకు రుచి చూపిన ధీర వనిత. తెలుగులో ఇప్పటికే ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో హీరోయిన్‌గా
బాలీవుడ్‌లో తటిల్లున మెరిసిన నిప్పుకణిక కంగనా రనౌత్. ఖాన్ త్రయాన్ని లెక్క చేయని పొగరు, హృతిక రోషన్‌ని మూడు చెరువుల నీరు తాగించిన ఆత్మాభిమానం, అడ్డం వస్తే కొండనైనా ఢీకొని సవాలు చేసే తత్వం, ఇన్ని దశాబ్దాల భారతీయ చలనచిత్ర చరిత్రలో తిరుగుబాటుకు మారుపేరు. ఇవన్నీ కంగనా రనౌత్ విశేషణాలు. ఒకరు ఇస్తే వచ్చినవి కావు. తనంతట తానుగా సంపాదించుకున్న గుణాలు. వ్యక్తిగా ఎంత రెబలో.. నటిగా అంత పవర్ పుల్. రెండు సినిమాలు.. ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’ నాయికా ప్రాధాన్య పాత్రలను హీరోయిన్‌లకు ఇస్తే ఆ సత్తా ఎలా ఉంటుందో బాలీవుడ్ బాక్సాఫీసుకు రుచి చూపిన ధీర వనిత. తెలుగులో ఇప్పటికే ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కంగనా ఇప్పుడు మరో తెలుగుసినిమా మణికర్ణిక చిత్రంలో మరో శక్తివంతమైన పాత్రను ధరిస్తోంది.
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవిత కథతో తెరకెక్కబోతున్న ‘మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’లో టైటిల్ పాత్రధారి కంగనాయే. తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా టైటిల్‌లోగో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం వారణాసిలో జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న కంగనా ఇంతటి అద్భుతమైన కథ రాసిన బాహుబలి కథా రచయిత విజయేంద్రప్రసాద్‌కు కృతజ్ఞతలు చెప్పేసింది.
‘మణికర్ణిక’లో నా పాత్రను ఆయన చాలా అద్భుతంగా పక్కాగా తీర్చిదిద్దారు. నా దగ్గరకు ఈ కథ వచ్చినప్పుడు ఇప్పటి వరకు లక్ష్మీబాయి కథ ఎందుకు వెండితెరకు ఎక్కలేదు అనిపించింది. వెంటనే ఇది నాకు దొరికిన గొప్ప అవకాశంగా ఒప్పేసుకున్నాను. అనుకోకుండా నాకు దక్కిన అదృష్టం ఈ చిత్రం’ అన్న కంగనా సూపర్ హీరో కథలా మణికర్ణిక కథను రాశారంటూ విజయేంద్రప్రసాద్‌ను ప్రశంసించింది. విజయేంద్ర ప్రసాద్ మణికర్ణిక కథను చెబుతున్నంత సేపు ఈల వేద్దామన్నంత థ్రిల్ వేసిందని, ఆ పని చేయకుండా బలవంతగా తన్ను తాను నిలవరించుకున్నానని కంగనా చెప్పింది.
‘నాదీ లక్ష్మీబాయి లాంటి తిరుగుబాటు మనస్తత్వమని చాలామంది అన్నారు. ఆ విషయాన్నీ నేనూ అంగీకరిస్తాను. ఓ లక్ష్యం కోసం తిరుగుబాటు చేసిన వనిత ఆమె. అదే ఆమెను హీరోను చేసింది. పరిస్థితుల్ని బట్టి నేనూ అప్పుడప్పుడు తిరుగుబాటు స్వరం వినిపిస్తుంటాను అంటున్న కంగనా ప్రపంచంలోనే గొప్పగా గుర్రపు స్వారీ చేసే వాళ్లలో ఒకరైన రాణి లక్ష్మీబాయి పాత్రను తాను ఆషామాషీగా తీసుకోలేదని గుర్రపుస్వారీ అనేది ఈ చిత్రంలో తన పాత్రకు చాలా కీలకమని చెప్పింది.
నటన కంటే దర్శకత్వం పట్ల ఆసక్తితో క్రిష్ తన చివరి దర్శకుడు అని బోల్డ్ ప్రకటన చేసిన కంగనా సినిమా విజయం...అపజయం మధ్యే తన జీవిత చక్రం ఉండిపోకూడదు అనుకుంటోంది. ముందు ఓ ఫిల్మ్‌మేకర్‌గా ఎదగిన తర్వాత మళ్లీ నటన గురించి ఆలోచిస్తానంటున్న కంగనా దర్శకత్వంలోనూ విజయాలు సాధించాలని కోరుకుందాం.
సినిమా ఇంకా ప్రారంభం కాకముందే విడుదల చేసిన మణికర్ణిక నిలువెత్తు ఫోటోలో కంగనా రాణి లక్ష్మీబాయిగా మెరిసిపోయింది. మరో బాహుబలి అని చెబుతున్న ఈ చిత్రం అప్పుడే హైప్ అవుతోంది.