ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (13:28 IST)

కన్నడ హీరో ఉపేంద్ర రాజకీయ పార్టీ పెట్టేశారు.. రాజకీయరంగంలో డబ్బు ప్రభావం తగ్గిస్తా!

కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేంద్ర రాజకీయ అరంగేట్రం చేశారు. తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయిన ఉపేంద్ర బెంగళూరులో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. 'కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ' పేరిట

కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేంద్ర రాజకీయ అరంగేట్రం చేశారు. తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయిన ఉపేంద్ర బెంగళూరులో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. 'కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ' పేరిట ప్రారంభమైన ఈ పార్టీ లోగోను ఉపేంద్ర మంగళవారం ఆవిష్కరించారు. 
 
బెంగళూరులోని గాంధీభవన్ వేదికగా జరిగిన ఉపేంద్ర పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పార్టీ సిద్ధాంతాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమానికి ఉపేంద్ర భార్య ప్రియాంక కూడా హాజరయ్యారు. ఉపేంద్ర అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అందరూ ఖాకీ షర్టులను ధరించారు. 
 
రాజకీయరంగంలో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిందని.. దాన్ని అంతం చేసేందుకు శాయశక్తులా పోరాటం చేస్తామని ఉపేంద్ర ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు ఉన్నత విద్యావంతులై ఉంటేనే మంచిదని అభిప్రాయపడ్డారు. రైతుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు.  
 
పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని ఉపేంద్ర పేర్కొన్నారు. ఇది ప్రజల పార్టీ అని ఉపేంద్ర వెల్లడించారు. ప్రజల కోసం తాను ఒక వేదికను మాత్రమే సిద్ధం చేశానని... తన లక్ష్యాలతో ఏకీభవించేవారంతా పార్టీలో భాగస్వాములు కావచ్చని తెలిపారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను ఈ పార్టీని ఆవిష్కరించానని వెల్లడించారు.