లక్ష్మీస్ ఎన్టీఆర్ మా జీవితాలను మార్చేసింది: శ్రీతేజ్, విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి
శ్రీతేజ్, విజయ్‌కుమార్, యజ్ఞాశెట్టి తదితరులు నటించిన చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్`. రాంగోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకులు. జి.వి ఫిలింస్ సమర్పణలో రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మార్చి 29న సినిమా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో చిత్ర ప్రధాన పాత్రధారులు శ్రీతేజ్, విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి మీడియాతో మాట్లాడారు.
శ్రీతేజ్ మాట్లాడుతూ - ``లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు చాలా మంచి స్పందన వస్తుంది. సినిమా చూసిన వారందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. నేను నారా చంద్రబాబునాయుడు గారి పాత్ర చేశాను. చాలా బాగా చేశానని అంటుంటే సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ విజయ్‌కుమార్ గారు, లక్ష్మీపార్వతి గారు యజ్ఞాశెట్టి అందరూ చక్కగా నటించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాంగోపాల్ వర్మగారికి థాంక్స్. వంగవీటిలో దేవినేని నెహ్రుగారి పాత్ర చేసినా.. ఈ సినిమాలో చంద్రబాబునాయుడు గారి పాత్ర చేసినా అందుకు ప్రధాన కారణం డైరెక్టర్ అగస్త్యమంజు గారే.
ఆయన్ను నా పెద్దన్నగా భావిస్తున్నాను. ఆర్‌జివిగారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఓ నటుడిగా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాను. డిసెంబర్ 6న నా జీవితంలో మరచిపోలేని రోజు. ఆ రోజు నుండి చంద్రబాబు నాయుడి గారి ఫోటోలు ఓ వెయ్యి కలెక్ట్ చేసుంటాను. ఆ పాత్ర మాత్రమే కనపడాలని తపన పడ్డాను. లుక్స్, బాడీ మేనరిజమ్స్ ఇలా అన్నీ విషయాల్లో కేర్ తీసుకుని చేశాను. ప్రతి సినిమాలో ఇలాంటి ఎఫర్ట్‌నే చేయడానికి ప్రయత్నిస్తాను. ఎక్కువగా పాత్ర గురించి రీసెర్చ్ చేసి చేశాను`` అన్నారు.
విజయ్‌కుమార్ మాట్లాడుతూ - ``45 సంవత్సరాలుగా నేను నాటకాల్లో ఉన్నాను. నన్ను హేళన చేసిన వారు కూడా ఉన్నారు. జీవితంలో టఫ్‌గా రోజులను గడిపాను. అలా గడపాను కాబట్టే.. కళామతల్లి నాకు రాంగోపాల్ వర్మగారి రూపంలో అవకాశం ఇచ్చారు. సోషల్, పౌరాణిక నాటకాల్లో అన్నీ పాత్రలు పోషించిన నటుడ్ని. చక్కటి నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాను. మా ఆర్‌జివి గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే..ఆయన అవకాశం ఇచ్చారు. అలాగే నాలో నటుడ్ని బయటకు తెచ్చిన డైరెక్టర్ మంజుగారికి థాంక్స్`` అన్నారు.
యజ్ఞా శెట్టి మాట్లాడుతూ - ``ఆర్‌జివిగారితో కిల్లింగ్ వీరప్పన్‌లో పనిచేశాను. తర్వాత ఆయనతో చేసిన రెండో సినిమా. అమేజింగ్ డైరెక్టర్ ఆర్‌జివిగారు .. సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను ఈ సినిమాలో టచ్ చేశారు. ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ చేశారు. ఆయనకు నచ్చడంతో స్క్రిప్ట్ పంపారు. తెలుగు రాని నేను చాలా కష్టపడి డైలాగ్స్ నేర్చుకున్నాను. ఆర్‌జివిగారు, మంజుగారు మంచి సలహాలనివ్వడంతో సినిమాను చక్కగా పూర్తి చేశాను. విజయ్‌కుమార్ గారు అద్భుతంగా నటించారు. ఆయనతో పోటీగా నేను ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాను. శ్రీతేజ్ సహా సినిమాలో ప్రతి ఒక క్యారెక్టర్ అద్భుతంగా నటించారు`` అన్నారు.