రాములమ్మకు నోటీసులు... శశికళకు సపోర్టు ఎఫెక్టేనా?
మాజీ ఎంపీ, సీనియర్ సినీనటి విజయశాంతికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆస్తుల విక్రయం కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి.
మాజీ ఎంపీ, సీనియర్ సినీనటి విజయశాంతికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆస్తుల విక్రయం కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. నటి విజయశాంతి నుంచి తాను కొనుగోలు చేసిన ఆస్తులను ఆమె మరొకరికి విక్రయించారంటూ ఇంద్రచంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ నోటీసులు జారీచేసింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
విజయశాంతి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో చెన్నైలో నివశిస్తూ వచ్చింది. ఆ సమయంలో ఆమె నగరంలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. అయితే, విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత తన స్థిరాస్తుల్లో కొన్నింటిని విక్రయించారు. ఇందులోభాగంగా, స్థానిక ఎగ్మోర్‌లో ఆమెకు చెందిన స్థిరాస్తిని ఇంద్రచంద్ అనే వ్యక్తికి 2006లో రూ.5.20 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన పవరాఫ్ అటార్నీ పత్రాలను కూడా తీసుకుని విజయశాంతికి రూ.4.68 కోట్లు అందించారు.
అయితే తాను కొనుగోలు చేసిన ఆస్తులను ఆమె వేరొకరికి విక్రయించారంటూ ఇంద్రచంద్ స్థానిక జార్జ్‌టౌన్ కోర్టులో కేసు వేయగా, ఈ కేసును విచారించిన కోర్టు ఆ పిటీషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై శనివారం విచారణ జరిపిన కోర్టు.. వివాదాన్ని ఇద్దరూ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆదేశిస్తూ విచారణను సోమవారం వాయిదా వేసింది. విజయశాంతి స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీచేసింది. కాగా, జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే బాధ్యతలు చేపట్టిన శశికళకు విజయశాంతి ఆమెకు మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే.