బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన విడుదలై సందడి చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున రూ.84 కోట్లు వసూలు చేయగా, రెండో రోజున కూడా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగించింది. తాజాగా ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్లను నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 48 గంటల్లో రూ.140 కోట్లు (గ్రాస్)ను వసూలు చేసినట్టు తెలుపుతూ పోస్టర్‍ను విడుదల చేసింది.
మరోవైపు, ఈ సినిమా కూడా రూ.100 కోట్లు దాటడంపై చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తన ఆరో చిత్రాన్ని థియేటర్‌లో చూసి ఆనందించాలని కోరారు. తనకు ఇంతకు మించిన సంక్రాంతి బహుమతి మరొకటి ఉండదన్నారు. కాగా, ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటి మాట్లాడుతూ, తన అంచనా ప్రకారం ఈ చిత్రానికి రూ.400 కోట్లు నుంచి రూ.500 కోట్లు వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ నయనతార నటించగా, విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో మెరిసిన విషయం తెల్సిందే.