''బాస్మతి బ్లూస్''లో మంచు లక్ష్మి డిఫరెంట్ రోల్.. త్వరలో రిలీజ్!
తన ప్రతిభను బహుముఖంగా ప్రదర్శిస్తూ టాలీవుడ్‌లో విలక్షణ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి ఇప్పటికే లాస్ వేగాస్, ఈఆర్, డెస్పరేట్ హౌస్ వైఫ్ లాంటి టెలివిజన్ సీరియల్స్‌తో పాటు, హాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. మళ్లీ చాలా రోజుల తర్వాత మంచు లక్ష్మి హాలీవుడ్ నిర్మాణ సంస్థలో చేస్తున్న సినిమా బాస్మతి బ్లూస్. ఈ సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగం ఇండియాలోనే జరిగింది. ఇటీవల అమెరికా వెళ్ళిన లక్ష్మి ఈ సినిమాకు సంబంధించిన తన డబ్బింగును కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో పనులు జరుగుతున్నాయి.
‘బాస్మతి బ్లూస్’ సినిమాలో బ్రీ లార్సన్, డోనాల్డ్ సతర్లాండ్, స్కాట్ బకుల ముఖ్య పాత్రల్లో నటించారు. డాన్ బారోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మేనిక్యూ కాల్ ఫీల్డ్ నిర్మించాడు. ఈ సినిమా ఓ సైంటిస్ట్ కథ. తాను సృష్టించిన కొత్త వరివంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇండియాకు వచ్చే ఓ శాస్త్రవేత్త … ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? మధ్యలో అతని జీవితం, ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగాయనే అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని పెద్ద మొత్తంలో AMBI డిస్ట్రిబ్యూషన్ సంస్థ చేజిక్కించుకుంది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాలో లక్ష్మి మంచు కీలకపాత్ర పోషించనున్నారన్న వార్త ఇంటర్నేషనల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తుంది.
బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా ఎలాగైతే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోందో.. సినిమా సినిమాకు ఒక డిఫరెంట్ యాంగిల్‌ను చూపిస్తూ మంచు లక్ష్మికూడా తనదైన శైలిలో దూసుకుపోతూ తన ప్రతిభను కనబరుస్తోంది.