1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 మే 2025 (19:36 IST)

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

nara lokesh murali
దేశ రక్షణలో భాగంగా జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. మురళీ నాయక్ స్వగ్రామమైన జిల్లాలోని గోరంట్ల మండలం, కళ్లి తండాలో అశ్రునయనాల మధ్య పూర్తి చేశారు. ఈ అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హాజరై, వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోశారు. 
 
మురళీ నాయక్ పార్థివ దేవానికి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత ఆయన... వీర జవాను కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు.
 
మరోవైపు, మురళీ నాయక్ అంత్యక్రియలు వారి సొంత భూమిలోనే నిర్వహించారు. అందువల్ల అక్కడే మురళీనాయక్ స్మారక స్థాపాన్ని ప్రభుత్వం నిర్మిస్తుందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అతని త్యాగ నిరతిని భావితరాలకు స్ఫూర్తిగా నిలిపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 
అలాగే, కళ్లితండా గ్రామ సర్పంచ్, గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు గ్రామానికి మురళీ నాయక్ తండాగా  పేరు మార్చనున్నట్టు మంత్రి లోకేశ్ ప్రకటించారు. ప్రభుత్వం ఎల్లపుడు సైనికుల కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.