గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (13:43 IST)

మేమే ఓ మాఫియా... చిరంజీవి ఓ చోటా రాజన్.. అల్లు అరవింద్ ఓ దావూద్ ఇబ్రహీం : నాగబాబు

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాతో పాటు తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్ "మై చానెల్ నా యిష్టం"లో యాక్టివ్‌గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమ కేవలం నలుగురు చేతిల్లోనే ఉందంటూ వస్తున్న కామెంట్స్‌కు ఆయన తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు. పైగా, తామే పెద్ద మాఫియా అని, అందులో చిరంజీవి ఓ చోటా రాజన్ అయితే.. అల్లు అరవింద్ ఓ దావూద్ ఇబ్రహీం అంటూ చెప్పుకొచ్చారు. 
 
తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నో విషయాలపై స్పందిస్తున్నారని.... కానీ సినీ రంగం నలుగురు పెద్దల చేతిలో ఉందనే వార్తలపై మాత్రం ఎందుకు స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వీటికి నాగబాబు తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. 
 
"సురేష్ బాబు కుటుంబం, నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని కుటుంబం.. ఈ నలుగురు... మరోవైపు నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు, అల్లు అరవింద్... ఇంతకు మించిన పెద్ద మాఫియా ఎవరుంటారు అని చమత్కరించారు. పైగా, తామే పెద్ద మాఫియా అని... తన అన్నయ్య చిరంజీవి ఓ చోటా రాజన్ అని, అల్లు అరవింద్ ఓ దావూద్ ఇబ్రహీం అని చెప్పారు.
 
అయితే, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తారతమ్యం ఉండదన్నారు. చిన్న సినిమాలు విడుదల కాకపోవడం అనేది పంపిణీదారులకు సంబంధించిన విషయమన్నారు. ఫలానా వాళ్ల సినిమా విడుదల అవుతోంది, వేరే సినిమాను విడుదల కాకుండా ఆపండని సినీ పెద్దలు ఎవరూ అనరని చెప్పారు. ఈ నలుగురి చేతుల్లోనే పరిశ్రమ ఉన్నట్టయితే.. వారికి కూడా ఫ్లాప్‌లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కొన్ని థియేటర్లు అరవింద్, దిల్ రాజుల చేతుల్లో ఉన్నప్పటికీ... తమ చేతిలో పవర్ ఏమీ ఉండదని గుర్తు చేశారు. 
 
ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావని... ఇలాంటి సమయంలో చిన్న సినిమాలను విడుదల చేసుకోవచ్చు కదా? అని నాగబాబు అన్నారు. బిజీ టైమ్ లోనే సినిమాను విడుదల చేయాలని అందరూ అనుకుంటారని... కానీ, ఎక్కువ డబ్బు వచ్చే సినిమానే డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటారని చెప్పారు. కథలో దమ్ముంటేనే సినిమాలు ఆడతాయని అన్నారు. 
 
పైగా, ప్రస్తుత కాలంలో 3 నుంచి 4 వారాలకు మించి ఆడే దమ్ము పెద్ద సినిమాలకు కూడా లేదని చెప్పారు. ఈ విషయంలో పెద్ద హీరోలు కూడా మినహాయింపు లేదన్నారు. ప్రేక్షకుడికి నచ్చితేనే ఆ మూవీ ఆడుతుందని లేనిపక్షంలో మూడు నాలుగు రోజుల్లోనే థియేటర్ల నుంచి తీసిపారేస్తున్నారని నాగబాబు గుర్తు చేశారు.