'పెదరాయుడు'లా పెత్తనం చెలాయించాలని అన్నయ్యకు లేదు : నాగబాబు
తన అన్నయ్య చిరంజీవికి టాలీవుడ్ చిత్రపరిశ్రమలో పెదరాయుడులా పెత్తనం చెలాయించాలన్న కోరిక, తపన లేదని మెగా బ్రదర్ నాగబాబు స్పష్టం చేసారు. ఈ నెల 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. కానీ, చిత్రపరిశ్రమలో మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి.
ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా నిలిచిన సినీనటుడు నాగబాబు 'మా'కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో అసోసియేషన్ సభ్యులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా ఎన్నికలు జరిగిన తీరుపై మండిపడ్డారు.సాధారణ ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరుగుతాయో అలాంటివే మా ఎన్నికల్లోనూ జరిగాయని నాగబాబు ఆరోపించారు.
సాధారణంగా ఎన్నికలప్పుడు సభ్యుల సంక్షేమం, అసోసియేషన్ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటామో తెలుపుతూ ఆయా అభ్యర్థులు పోటీ చేస్తారని, అయితే, ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మాత్రం ప్రాంతీయ వాదం, కులంతో పాటు ప్రకాశ్ రాజ్ వృత్తిపరమైన విషయాలనూ తీసుకొచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకాశ్ రాజ్ వ్యక్తిగత హోదాకు ఇబ్బంది కలిగేలా ప్రత్యర్థి ప్యానల్ సభ్యులు కామెంట్లు చేశారని తెలిపారు. దీంతో ప్రకాశ్ రాజ్‌కు మద్దుతుదారుడిగా తాను వారికి కౌంటర్ ఇచ్చానని గుర్తుచేశారు. తాను ఇన్నాళ్లు మాలో భాగమైనందుకు చాలా గర్వపడ్డానని తెలిపారు.
తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదని తాను అనుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల తర్వాత నిజాలు తెలుసుకుని, సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించలేదన్నారు. అందుకే తాను మనస్తాపం చెందానని, మా నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. తనకు ఇకపై 'మా'తో ఎలాంటి సంబంధంలేదని నాగబాబు తెగేసి చెప్పారు.
అదేసమయంలో సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అన్నయ్య చిరంజీవి ఎప్పుడూ అనుకోలేదన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారు, ఇతరులు ఎవరైనా కష్టాల్లో తమ ఇంటికి వస్తే చిరంజీవి తనకు చేతనైనంత సాయం చేశారేగానీ పెదరాయుడులా పెత్తనం చెలాయించలేదన్నారు.
ముఖ్యంగా, పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడూ అనలేదని తెలిపారు. చిరంజీవికి అంత అహంకారం లేదన్నారు. తమకు మరో అసోసియేషన్ పెట్టే ఆలోచన కూడా లేదని మెగా బ్రదర్ నాగబాబు తేల్చిచెప్పారు.