మామిడికాయ పచ్చడి తినీ.... మణిరత్నం ఆరోగ్యంపై క్లారిటీ
లెజండ్రీ దర్శకుడు మణిరత్నం గుండెపోటుకు గురయ్యారనీ, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ సోమవారం అనేక ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు... వెబ్, సోషల్ మీడియాలో స్క్రోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. నిజానికి ఆయన రెగ్యులర్ చెకప్స్ కోసం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో మణిరత్నంకు మరోమారు గుండెపోటు వచ్చిందంటూ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేశారు.
ఈ వార్తలపై మణిరత్నం సతీమణి, సినీ నటి సుహాసిని క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశంపై ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "నా భర్త తదుపరి సినిమా కోసం ఉదయం 9:30 గంటలకే ఆఫీస్‌కు వెళ్లారు. నేను తదుపరి సినిమాకు సంబంధించిన వర్క్ షాప్‌లో ఇంట్లో బిజీగా ఉన్నాను. నా భర్త ఉదయం చేసిన రోటి, మామిడికాయ పచ్చడి ఇష్టంగా తిని తదుపరి మూవీ స్క్రిప్ట్ వర్క్ కోసం ఆఫీస్‌కు వెళ్ళారు" అని సుహాసిని పేర్కొంది.
దీంతో మణిరత్నం ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న పుకార్లకి బ్రేక్ పడింది. ప్రస్తుతం మణిరత్నం "పొన్నియన్ సెల్వం" చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా ఇందులో భారీ తారాగణం నటిస్తున్నారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు తెలుస్తుంది.