రాజకీయాల్లో ఓ రెబెల్ హరికృష్ణ... అందుకే చంద్రబాబు పక్కనపెట్టేశారట...
రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన సినీ హీరో నందమూరి హరికృష్ణ రాజకీయాల్లో మాత్రం రెబెల్‌గా చెలామణి అయ్యారు. తన తండ్రి ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. అపు
రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన సినీ హీరో నందమూరి హరికృష్ణ రాజకీయాల్లో మాత్రం రెబెల్‌గా చెలామణి అయ్యారు. తన తండ్రి ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. అపుడు ఎన్టీఆర్ చైతన్య రథానికి హరికృష్ణ రథసారథిగా వ్యవహరించారు.
మొత్తం 9 నెలల పాటు ఎన్టీఆర్ చైతన్య రథాన్ని ఆయనే నడిపారు. తండ్రితో కలిసి రాష్ట్రం మొత్తం నాలుగుసార్లు పర్యటించారు. అయితే అలాంటి వ్యక్తి 1995లో తన తండ్రికి వెన్నుపోటు పొడిచి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన చంద్రబాబుకు అప్పట్లో అండగా నిలిచారు. ఆయన ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 1996లో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 1999 వరకు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు ఎదురుతిరిగారు.
1999, జనవరి 26న అన్నా టీడీపీ పార్టీ స్థాపించారు. 1999 ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. ఆయన తమ్ముడు బాలకృష్ణ.. బాబువైపు నిలిచినా హరికృష్ణ మాత్రం చాలా కాలం బాబుకు దూరంగా ఉంటూ వచ్చారు.
2009 ఎన్నికలకు ముందు మరోసారి హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌లను బాబు మరోసారి దగ్గరకు తీశారు. దీంతో ఆ ఎన్నికల్లో ఇద్దరూ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత హరికృష్ణ రాజ్యసభ ఎంపీ అయ్యారు. అయితే రెండోసారి ఆయనను రాజ్యసభకు పంపకపోవడంతో బాబుతో మరోసారి విభేదాలు వచ్చి కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. అలా హరికృష్ణకు రాజకీయాలతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పొచ్చు.