శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2017 (14:09 IST)

అమ్మకానికి అన్న(ఎన్టీఆర్)గారి నివాసం..?

తెలుగువారి ఆత్మ గౌరవం స్వర్గీయ ఎన్టీఆర్. ఆయన ఆత్మ క్షోభించనుంది. చెన్నైలోని ఆయన నివాసం అమ్మకానికి పెట్టారు. అన్నగారు స్థాపించి పార్టీ నాది.. అన్నగారి ఆస్తులు మావి అనే తెలుగు తమ్ముళ్లు, అన్నగారి వారసుల

తెలుగువారి ఆత్మ గౌరవం స్వర్గీయ ఎన్టీఆర్. ఆయన ఆత్మ క్షోభించనుంది. చెన్నైలోని ఆయన నివాసం అమ్మకానికి పెట్టారు. అన్నగారు స్థాపించిన పార్టీ నాది.. అన్నగారి ఆస్తులు మావి అనే తెలుగు తమ్ముళ్లు, అన్నగారి వారసులు అన్నగారి ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారా? అంటే ఔననే అంటున్నారు చెన్నైలోని అన్నగారి అభిమానులు. శిథిలమై, అమ్మకానికి సిద్ధంగా ఉన్న దివంగత మహానటుడు నందమూరి తారక రామారావు నివాసం ఇప్పుడు చెన్నైలో హాట్ టాపిక్‌గా మారింది.
 
సినీ రంగానికి వచ్చాక తాను నివాసముండేందుకు అన్న ఎన్టీఆర్ చెన్నై బజుల్లా రోడ్‌లో గృహాన్ని ఏర్పాటుచేసుకున్నారు. మూడు గ్రౌండ్ల విస్తీర్ణంలో 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహాన్ని నిర్మించుకున్నారు. ఈ నివాసం 128 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పు ఉండేది. ఎంత ఎత్తుకు ఎదిగినా మహానటుడిగా మారినా ఆయన అదే నివాసంలో ఉండేవారు. ఎన్డీఆర్ ఆ నివాసంలో ఉన్నప్పుడు ఆంధ్రదేశం నుంచి తరలివచ్చే అభిమానులకు ఏళ్ల తరబడి ఇదే నివాసంలోని బాల్కాని నుంచి అభివాదం చేసి వారిని క్షేమసమాచారాలు అడిగి పంపించేవారు. 
 
అన్నగారిని చూసేందుకు తండోపతండాలుగా బస్సుల్లో, వ్యానుల్లో నిత్యం వేలాది అభిమానులు తరలివచ్చి ఆ నివాసం ముందు బారులు తీరేవారు. ఆయన్ను చూసేందుకు తిరుపతి నుంచి నేరుగా శ్రీవారి దర్శనానంతరం భక్తులు కూడా ఇక్కడకు వచ్చేవారంటే ఆయనపై అభిమానం అలాంటిది. ఆయన నివాసాన్ని అభిమానులు ఓ ఆలయంలా భావించారు. ఆయన ఆ నివాసం ఉన్నంత కాలం అభిమానులకు, సినీ పరిశ్రమకు ఈ నివాసం పవిత్ర కోవెలగా విరాజిల్లింది.
 
తమిళ నటుడు ఎంజీఆర్‌ను చూసి ఆంధ్రదేశంలో ప్రాంతీయ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఆయ్యాక తన నివాసాన్ని హైదరాబాద్‌కు మార్చారు. అయినా ఆయన జీవించివున్నంతవరకు చెన్నైలోని నివాసం ఆయన కుటుంబీకులతో కళకళలాడింది. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఈ నివాసంపై మక్కువతో అడపాదడపా వచ్చి వెళ్లేవారు. 
 
అనంతరం ఆయన దివంగతులయ్యాక ఇక్కడి నివాసంలో ఆయన కుటుంబసభ్యులు కూడా ఈ గృహానికి దూరమవుతూ వచ్చారు. కాలక్రమేణా ఎన్టీఆర్ ఆస్తులు ఆయన కుమారులు, కుమార్తెలకు దక్కాయి. ఈ నివాసం కూడా వారసులకే చెందాయి. అయితే మహానటులు, తెలుగు జాతి ఆత్మగౌరవంగా మారిన అన్నగారి ఆత్మశాంతి చేకూరాలంటే ఈ నివాసాన్ని ఆయన స్మారక చిహ్నం ఉంచాలని చెన్నైలోని తెలుగు వారంతా కోరుకున్నారు. 
 
అంతేకాదు ఎన్టీఆర్ వారసులం, టీడీపీ పార్టీ మాదే అనే చంద్రబాబు నాయుడు కలిసి కొందరు అభిమానులు ఈ నివాసాన్ని అన్నగారి జ్ఞాపకార్థంగా మరమ్మత్తులు చేయించి స్మారక మందిరంగా మార్చాలని కోరారు. పార్టీ కావాలి… ఆయన వారసత్వం కావాలి.. కానీ ఆ నివాసం మాకెందుకు అనుకున్నారేమో ఇప్పుడు అన్నగారి ఇంటిని అమ్మకానికి పెట్టారు. 
 
డి. ఏళుమలై అనే బ్రోకరు పేరుతో ఓ ఫోన్ నెంబర్ రాసి ఓ బోర్డు పెట్టారు. రూ.25 కోట్లుగా ఈ నివాసం ధరను నిర్ణయించగా ఎవరొస్తే వారికి అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నివాసం ప్రస్తుతం అన్నగారి కుమారుల పేరునే ఉందని, కొనుగోలుదారులు వస్తే నేరుగా వారితోనే విక్రయానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని ఏళుమలై చెపుతుండటం సగటు అన్నగారి అభిమాని తీవ్ర ఆవేదనకు లోనవుతున్నాడు.
 
మొత్తంమీద చెన్నై నగరంలో అన్నగారి జ్ఞాపకాలు విక్రయానికి ఉంచడం అన్నగారి ఆత్మక్షోభకు కారణమైంది. అంతేకాదు.. అన్నగారు దాదాపు 40 ఏళ్లపాటు నివశించిన ఈ నివాసమంటేనే చాల ఇష్టమని, ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతుంటుందని చెన్నైలో అభిమానులు అంటున్నారు. మరి అన్నగారి పార్టీ మాదే.. ఆయన జ్ఞాపకాలు మావే.. ఆయన ఆస్తులు మావే అనే నాయకులు, వారసులు ఏం సమాధానం చెపుతారో వేచి చూడాలి.