సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 28 జులై 2021 (18:24 IST)

ఇష్క్ మీద వంద శాతం నమ్మకం ఉంది- నిర్మాత ఎన్వీ ప్రసాద్

తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రం `ఇష్క్‌`. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జులై30న గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్  చిత్ర విశేషాలను పంచుకున్నారు.
 
ప్రస్తుతం సినిమాలను రిలీజ్ చేసేందుకు అందరూ భయపడుతున్నారు. కానీ మీరు మాత్రం ముందే విడుదల తేదీని ప్రకటించేశారు?
- చేయాలి కదండి. ఏం జరిగినా కూడా మనం సినిమా పరిశ్రమలో ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాటం చేయాల్సిందే. మంచి సినిమా తీశాం. మంచి సినిమాను జనాలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. వంద శాతం ఇది మినిమమ్ గ్యారెంటీ సినిమా. ప్రస్తుతం పరిస్థితులు కూడా కొంచెం సద్దుమణిగాయి. ఇప్పటికే చాలా కంటెంట్ రావడానికి సిద్దంగా ఉంది. 
 
ఇంకా కొంచెం వేచి చూద్దామనే ధోరణిలో కొందరు నిర్మాతలు ఉన్నారు కదా?
- ఇది ఎప్పుడైనా తప్పదండి.. రిస్క్ తీసుకోవాల్సిందే. మేం (ఇష్క్ టీం), తిమ్మరుసు నిర్మాతలు రిస్క్ తీసుకున్నాం. కచ్చితంగా పాజిటివ్ ఫలితం వస్తుందని ఆవిస్తున్నాం.
 
పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మీరు ఈ చిత్రంపై ఎలా దృష్టి పడింది?
- ఇష్క్ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. యూత్‌కు కావాల్సిన అంశాలు ఉంటాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో  రీమేక్ చేశాం. యూత్ ఒంటరిగా వెళ్లినప్పుడు ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఉంటుంది. య‌స్‌.య‌స్‌. రాజు చక్కగా తెరకెక్కించారు. మొదటి  నుంచి ఈ సినిమాను థియేటర్‌కే అనుకున్నాం. అలానే విడుదల చేస్తున్నాం.
 
జనాలకు ప్రస్తుతం ఉన్న భయాల్లో థియేటర్లకు వస్తారని అనుకుంటున్నారా?
జనాలకు ఎలాంటి భయాలు లేవు.. అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడో దగ్గర ఇండస్ట్రీ ముందడుగు వేయాలి కదా. ఎవరో ఒకరు మొదలుపెడితే అందరూ వస్తారు. అన్ని చిత్రాలు విడుదలవుతాయనే నమ్మకం ఉంది. 
 
ఓటీటీలకు అలవాటు పడ్డ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అనుకుంటున్నారా?
- ఇంట్లో ఉండి చూడటం కంటే అందరితో కలిసి థియేటర్స్ లో  చూడటంలో మజా ఉంటుంది.
 
కరోనా వల్ల నిర్మాణ పరంగా ఏమైనా మార్పులు జరుగుతాయా?
నిర్మాణంలో ఎలాంటి మార్పులు రాలేదు. ఇంకా బడ్జెట్‌లు పెరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు తమిళంకు గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ఇండియాలో సినిమా అంటే.. హైద్రాబాద్ హబ్‌లా మారింది. అన్ని  భాషల చిత్రాల షూటింగ్ కూడా ఇక్కడే  జరుగుతోంది. కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతోంది. ఇండియన్ సినిమా అంటే హైద్రాబాద్. ఈ మేరకు ప్రభుత్వం కూడా సహకారం చేస్తోంది. హైద్రాబాద్, సినిమాకు విడదీయరాని బంధం ఏర్పడింది.
 
ఇష్క్ చిత్రాన్నివేరే నిర్మాతలు కూడా తీయాలని ప్రయత్నించారు కదా?
అవును అది రకరకాలుగా  జరిగింది. మంచి కంటెంట్.. చాలా రోజుల తరువాత వస్తున్నాం కదా? అని మేం తీసుకున్నాం. ఈ కరోనా వల్ల మధ్యలో ఆగిపోయింది. మాదంతా కూడా ఒక ఫ్యామిలీ. వాకాడా అప్పారావు గారు తెలుగులో మా సినిమాలను దగ్గరుండి చూసుకునే వారు. ఆయన మా కుటుంబ సభ్యుల్లాంటి వారు. అందుకే ఆయన కుమారుడిని ఇందులోకి తీసుకున్నాం.