పిండం నాకు 15 ఏళ్ళ తర్వాత సోలో విజయాన్ని అందించింది : హీరో శ్రీరామ్
ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. రోజురోజుకి షోలు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం నాడు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విజయోత్సవ సభను నిర్వహించింది.
ఇది దర్శకుడి మొదటి సినిమా లాగా లేదు:
కథానాయకుడు శ్రీరామ్ మాట్లాడుతూ.. "మా సినిమాని ప్రేక్షకులకు చేరువ చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నిజాయితీగా సినిమా చేస్తే, దానిని గెలిపిస్తామనే నమ్మకాన్ని మరోసారి ఇచ్చారు. 15 ఏళ్ళ తర్వాత నాకు సోలో విజయాన్ని అందించిన ప్రేక్షకులను మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. పీఆర్ఓ వేణుగోపాల్ గారికి, బన్నీ గారికి థాంక్స్. మా సినిమాని పెద్ద సినిమా లాగా విడుదల చేసిన శంకర్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ గారికి ధన్యవాదాలు. మా దర్శకుడు సాయికిరణ్ గారికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాని రూపొందించారు. మన చేసే పని పట్ల నిజాయితీ, నిబద్దత ఉంటే అలా చేయగలరు. నేను ప్రాజెక్ట్ లో భాగం కావడానికి కరమైన సతీష్ గారికి కృతఙ్ఞతలు. ఇది టీం వర్క్. టీం అంతా కలిసి మంచి అవుట్ పుట్ తీసుకొచ్చాము. నేను చూసిన మంచి నిర్మాతల్లో యశ్వంత్ గారు ఒకరు. ఆయన ముందు ముందు ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు." అన్నారు.
సాయికిరణ్ దైదా దర్శకత్వంలో కళాహి మీడియా రెండో సినిమా ప్రకటన:
నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి మాట్లాడుతూ.. "మాది చిన్న సినిమా అయినప్పటికీ మాకు అండగా నిలిచిన మీడియా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని పిండం చిత్రం మరోసారి రుజువు చేసింది. దర్శకుడు సాయికిరణ్ గారు కేవలం 36 రోజుల్లోనే ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. దాని ఫలితమే 170 స్క్రీన్ లతో మొదలైన ఈ సినిమా, 400 లకు పైగా స్క్రీన్ ల వరకు వెళ్ళింది. ఒకప్పుడు ప్రేక్షకుడిగా శ్రీరామ్ గారి సినిమాలు చూసేవాడిని. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయనతో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అవసరాల శ్రీనివాస్ గారు అద్భుతమైన నటుడు. పిండంలో చాలా మంచి పాత్ర పోషించారు. ఈశ్వరీ రావు గారు, ఖుషీ రవి గారు, అలాగే చిన్న పిల్లలు ఇలా అందరూ ఎంతో చక్కగా నటించారు. ఇక నుంచి మా సంగీత దర్శకుడు సౌరభ్ పేరు పరిశ్రమలో మారుమోగిపోతుంది. మా సినిమాని భుజాన వేసుకొని ఇంతమందికి చేరువయ్యేలా చేసిన మా పీఆర్ఓ వేణుగోపాల్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. పిండం విజయవంతమైన సందర్భంగా మా కళాహి మీడియా బ్యానర్ లో రూపొందనున్న రెండో సినిమాని ప్రకటిస్తున్నాను. సాయికిరణ్ దైదా దర్శకత్వంలో పొలిటికల్ డ్రామా చేస్తున్నాము. ఈ కంప్లీట్ కమర్షియల్ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది. మా మొదటి సినిమా పిండంకి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం. రెండో సినిమా ఇంతకు మించి ఉంటుందని హామీ ఇస్తున్నాను" అన్నారు.
చిన్న సినిమా ఈ స్థాయిలో విడుదలవ్వడం నిజంగా గొప్ప విషయం:
దర్శకుడు సాయికిరణ్ దైదా మాట్లాడుతూ.. "నేను పిండం కథ మొదలు పెట్టినప్పుడు.. ఈ సినిమా థియేటర్లలో ఇంత భారీగా విడుదలవుతుంది అని ఊహించలేదు. యూఎస్ 120 కి పైగా స్క్రీన్ లు, ఇండియాలో 400 కి పైగా స్క్రీన్ లలో విడుదల కావడం నిజంగా గొప్ప విషయం. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మొదటగా నా భార్య, కాస్ట్యూమ్ డిజైనర్ పద్మ కి, అలాగే నా సోదరుడు, నిర్మాత యశ్వంత్, మరియు నా బెస్ట్ ఫ్రెండ్, సోదరుడు ప్రభు, ముఖ్యంగా సురేష్ గారు ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. సంగీత దర్శకుడు సౌరభ్ గారు, ఎడిటర్ ప్రసాద్ గారు అద్భుతంగా పని చేశారు. అలాగే రచయిత కవి సిద్ధార్థ గారికి, డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కి, కళాహి మీడియా ప్రమోషన్ ఇంచార్జి బన్నీకి, పీఆర్ఓ వేణుగోపాల్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు." అన్నారు.
నటుడు రవివర్మ మాట్లాడుతూ.. " ఈమధ్య సక్సెస్ మీట్ లు జరుపుకోవడం తగ్గిపోయింది. పిండం సినిమా సక్సెస్ మీట్ జరుపుకోవడం సంతోషంగా. వైజాగ్ లో నా మిత్రులు సినిమా చూడటానికి వెళ్లి, థియేటర్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డు చూసి నాకు ఫోన్ చేశారు. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మంచి టీం, మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చారు. ఇలాంటి సినిమాని థియేటర్లో మిస్ అవ్వకండి. ఇది మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది" అన్నారు.
రచయిత కవి సిద్ధార్థ మాట్లాడుతూ.. "మంచి సినిమాకి ఎప్పుడూ ప్రేక్షకుల మనసులో చోటు ఉంటుంది. పిండం సినిమాతో అది మరోసారి రుజువైంది. మేము చేసిన ఈ మంచి సినిమా, ప్రేక్షకుల మన్ననలు పొందటం సంతోషంగా ఉంది. ముందు ముందు ఇలాంటి మంచి సినిమాలు అందించడానికి కృషి చేస్తాం" అన్నారు.