గురువారం, 30 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (09:27 IST)

హీరో సూర్యకు బెదిరింపులు - ఇంటికి సాయుధ బలగాల భద్రత

తమిళ హీరో సూర్యకు వన్నియర్ సంఘ నేతలు బెదిరించారు. దీంతో ఆయన ఇంటికి సాయుధ బలగాలతో భద్రత కల్పించారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం "జై భీమ్". ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, పాత్రల పేర్లు వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా, తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలకు ఓ ఓటు బ్యాంకులా ఉన్న వన్నియర్ వర్గం ప్రతిష్టను దిగజార్చేలా ఉందనే వివాదం గత కొన్ని రోజులుగా నడుస్తోంది. దీనిపై అనేకమంది ప్రకటనలు విడుదల చేశారు. 
 
ముఖ్యంగా, ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ సూర్యను అభినందిస్తున్నారు. కానీ, వన్నియర్ వర్గ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో పీఎంకే పార్టీకి చెందిన నాగపట్టణం జిల్లా కార్యదర్శి పళనిస్వామి విడుదల చేసిన ప్రకటనలో హీరో సూర్యను బెదిరించారు. దీంతో స్థానిక టి.నగర్‌ ఆర్కాట్ రోడ్డులో ఉన్న హీరో సూర్య ఇంటికి సాయుధబలగాలతో భద్రతను కల్పించారు. 
 
కాగా, "జై భీమ్" చిత్రం దీపావళి పండుగ సందర్భంగా డిసెంబరు 2వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన వన్నియర్ వర్గ నేతలు చిత్ర నిర్మాతలైన హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతికలకు రూ.5 కోట్ల పరువు నష్టం దావా నోటీసులు పంపించిన విషయం తెల్సిందే.