అజ్ఞాత ప్రాంతంలో ఆనందయ్య... పోలీసులు ఏం చేస్తున్నారు?
ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను పోలీసులు అష్టకష్టాలు పెడుతున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తమ ఆధీనంలో ఉంచున్న పోలీసులు... శుక్రవారం ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్లీ అర్థరాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇపుడు రహస్య ప్రాంతానికి తరలించారు.
కృష్ణపట్నంలో ఆయన కరోనాకు మందు ఇస్తున్న నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటుంది. శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆయనను తీసుకెళ్లారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆనందయ్యకు భద్రత కల్పిస్తూ పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు.
మరోవైపు, కృష్ణ పట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ముత్తుకూరు నుంచి వచ్చే స్థానికేతరులకు అనుమతి నిరాకరిస్తున్నారు. కృష్ణపట్నం, గోపాలపురంలో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
ఇతర ప్రాంతాల నుంచి కృష్ణపట్నానికి అంబులెన్సుల్లో రోగులు వస్తున్నారు. వారిని పోలీసులు వెనక్కి పంపుతున్నారు. మరోవైపు, ఆనందయ్య ఔషధంపై సోమవారం తుది నివేదిక రానుంది.
ఇదిలావుంటే, ఆనందయ్య కరోనా మందు పనితీరుపై అధ్యయనం చేసిన తిరుపతి ఆయుర్వేద వైద్య కళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థలు అందుకు సంబంధించిన నివేదికను ఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఆన్‌లైన్‌లో సమర్పించాయి. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కేంద్ర పరిశోధన సంస్థ ఈ మందుపై తన అభిప్రాయాన్ని సోమవారం వెల్లడించనుంది.